LOADING...
Rohan Bopanna: గ్రాండ్‌స్లామ్‌ విజేత, అర్జున అవార్డు గ్రహీత రోహన్ బోపన్న టెన్నిస్‌కు రిటైర్మెంట్
గ్రాండ్‌స్లామ్‌ విజేత, అర్జున అవార్డు గ్రహీత రోహన్ బోపన్న టెన్నిస్‌కు రిటైర్మెంట్

Rohan Bopanna: గ్రాండ్‌స్లామ్‌ విజేత, అర్జున అవార్డు గ్రహీత రోహన్ బోపన్న టెన్నిస్‌కు రిటైర్మెంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న తన ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. 45 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాలకుపైగా భారత టెన్నిస్‌ రంగానికి సేవలందించాడు. చివరి మ్యాచ్‌గా పారిస్‌ మాస్టర్స్‌ 1000లో అలెగ్జాండర్‌ బుబ్లిక్‌తో జతగా డబుల్స్‌ ఆడాడు. గాయాలు, ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయని బోపన్న.. భారత టెన్నిస్‌కు మూలస్తంభంగా నిలిచాడు. రెండు మోకాళ్లలో కార్టిలేజ్‌ అరిగిపోయి తీవ్ర నొప్పులు ఎదురైనా 2019లో రోజుకు రెండు మూడు పెయిన్‌కిల్లర్స్‌ వేసుకుంటూ ఆట కొనసాగించాడు. ఆటపై అతని అంకితభావం ఇదే నిదర్శనం. ఈ బాధల నుంచి బయటపడేందుకు యోగా బోపన్నకు జీవనాంతర మార్గం చూపింది.

Details

43 వయస్సులో టైటిల్ ను నెగ్గాడు

2020లో కరోనా సమయంలో అయ్యంగార్‌ యోగా చేయడం ప్రారంభించాడు. వారంలో నాలుగు రోజుల పాటు 90 నిమిషాల చొప్పున యోగా చేయడం ద్వారా మోకాళ్ల నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా ఆయన మళ్లీ కోర్టులో కొత్త ఉత్సాహంతో అడుగుపెట్టాడు. ఆయన పట్టుదల ఫలితంగా 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2024 డబుల్స్‌లో టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించాడు. ఇది అతని కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయంగా నిలిచింది. అంతేకాదు, గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన అతి పెద్ద వయస్కుడైన టెన్నిస్‌ ఆటగాడిగా, డబుల్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Details

2019లో అర్జున అవార్డు

ఇప్పటివరకు బోపన్న రెండు సార్లు (2010, 2023) యుఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కెనడాకు చెందిన గాబ్రియెల్‌ డబ్రోస్కీతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిచాడు. మొత్తం టూర్‌ స్థాయిలో 26 డబుల్స్‌ టైటిళ్లు, ఆరు ఏటీపీ మాస్టర్స్‌ 1000 టైటిళ్లు నెగ్గాడు. భారత టెన్నిస్‌లో చెరగని ముద్ర వేసిన బోపన్న సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో అర్జున అవార్డు, 2024లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో బోపన్న కేవలం టెన్నిస్‌ ఆటగాడిగానే కాకుండా, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు.