GST collections: జీఎస్టీ రేట్లు తగ్గినా రికార్డు వసూళ్లు.. నిండినా ప్రభుత్వ ఖజానా!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి చరిత్ర సృష్టించాయి. జీఎస్టీ రేట్లు తగ్గించినా, పండగ సీజన్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రభుత్వం అక్టోబర్ నెలలో రూ.1.96 లక్షల కోట్లు వసూలు చేసినట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి వసూళ్లలో ఒకటి. గతేడాది ఇదే నెలలో నమోదైన రూ.1.87 లక్షల కోట్లతో పోల్చితే ఈసారి 4.6 శాతం వృద్ధి కనిపించింది.
Details
పన్ను తగ్గింపులు, పండగ కొనుగోళ్ల ప్రభావం
కిచెన్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సహా 375 ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. దసరా నవరాత్రులు, దీపావళి పండగల సందర్భంలో భారీగా కొనుగోళ్లు జరగడంతో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దీపావళికి ముందు జీఎస్టీ రూపంలో శుభవార్త వస్తుందని ప్రకటించడంతో పలువురు వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసి అక్టోబర్‌లో చేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Details
వసూళ్లలో పెరుగుదల
2024 అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూలు కాగా, గత నెల సెప్టెంబర్‌లో రూ.1.89 లక్షల కోట్లు, ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీని ద్వారా నెలవారీ స్థాయిలోనూ వృద్ధి కనిపించింది. అయితే, గడచిన నెలల సగటు వృద్ధి రేటు (9%) కంటే కొంచెం తక్కువగా ఈసారి నమోదు కావడం గమనార్హం.
Details
వసూళ్ల విభజన
అక్టోబర్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లలో రూ.1.45 లక్షల కోట్లు * దేశీయ వినియోగానికి సంబంధించినవి రూ.50,884 కోట్లు దిగుమతులపై సుంకాల రూపంలో సమకూరాయి. అదే సమయంలో రూ.26,934 కోట్లు జీఎస్టీ రిఫండ్‌లుగా ఇచ్చిన తర్వాత నికర వసూళ్లు రూ.1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల అనుసరణ, రేట్ల తగ్గింపు, పండగ సీజన్ వినియోగం — ఇవన్నీ కలిసి అక్టోబర్ జీఎస్టీ వసూళ్లను కొత్త గరిష్ఠానికి చేర్చాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.