Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రపన్నాడన్నఅమెరికా అధికారులు అభియోగాలు మోపిన కేసులో భారత జాతీయుడు నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ని అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశం సున్నితమైనదని, విదేశీ కోర్టు అధికార పరిధిని గౌరవించాలని పేర్కొంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని సుప్రీం తెలిపింది. నిఖిల్ గుప్తా తరఫు న్యాయవాది సి ఆర్యమ సుందరం సమర్పించిన సమర్పణపై జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ..తాము అంతర్జాతీయ చట్టాల్లో జోక్యం చేసుకోలేమని సప్రీంకోర్టు తెలిపింది. ఒక విదేశీ కోర్టు అధికార పరిధిని గౌరవించాలని కోర్టు తెలిపింది.
జూన్ 2023లో చెక్ రిపబ్లిక్‌లో అరెస్ట్ అయ్యిన నిఖిల్ గుప్తా
US అధికారుల అభ్యర్థన మేరకు 52 ఏళ్ల భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తాను జూన్ 2023లో చెక్ రిపబ్లిక్‌లో అరెస్టు చేశారు. సిక్కు వేర్పాటువాద లీడర్ గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని, ఇందులో మరో భారత ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉందని అమెరికా అభియోగాలు మోపింది. అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న పన్నూని అమెరికా గడ్డపై చంపాలని కుట్ర పన్నడాన్ని యూఎస్ సీరియస్‌గా తీసుకుంది. భారత్ కూడా ఈ కేసును విచారించేందుకు అత్యున్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. నిఖిల్ గుప్తా, పన్నూను చంపేందుకు ఓ కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బులు చెల్లించడానే ఆరోపణలు ఉన్నాయి.