LOADING...
Digital Arrest:  నిర్మలా సీతారామన్ సంతకం  ఫోర్జరీ చేసి.. రూ.99 లక్షల మోసం
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి.. రూ.99 లక్షల మోసం

Digital Arrest:  నిర్మలా సీతారామన్ సంతకం  ఫోర్జరీ చేసి.. రూ.99 లక్షల మోసం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల "డిజిటల్ అరెస్ట్" పేరుతో సైబర్ నేరాలు విస్తరిస్తున్నాయి. నేరగాళ్లు వ్యక్తులను కేసుల్లో ఇరుక్కున్నారంటూ భయపెట్టి, ఒత్తిడికి గురిచేసి, ఆందోళనలో ఉన్న వారిని ఆర్థికంగా దోచుకుంటున్నారు. తాజాగా పుణెలో నివసించే ఒక రిటైర్డ్ ఎల్‌ఐసీ మహిళాధికారిణి ఈ మోసగాళ్ల బారిన పడి సుమారు రూ.99 లక్షలు కోల్పోయారు. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం నకిలీ పత్రంను ఉపయోగించడం విశేషం. పోలీసుల వివరాల ప్రకారం, పుణెలో నివసించే 62 ఏళ్ల మాజీ ఎల్‌ఐసీ అధికారిణికి ఇటీవల ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను "డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ" ప్రతినిధినని తెలిపాడు. ఆమె ఆధార్ నంబర్‌కు అనుబంధంగా ఉన్న మొబైల్ నంబర్‌ మోసపూరిత లావాదేవీల్లో ఉపయోగించబడిందని పేర్కొన్నాడు.

వివరాలు 

నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం ఉన్న ఆర్డర్ పత్రం

అదే సమయంలో మరో వ్యక్తి వీడియో కాల్ చేసి తాను జార్జ్ మాథ్యూ అనే సీనియర్ పోలీసు అధికారినని చెప్పాడు. మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని, దాంతోపాటు బ్యాంకు ఖాతాలు నిలిపివేయనున్నామని హెచ్చరించాడు. ఇంకా, కేంద్ర ఆర్థికశాఖ తరఫున అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని చెబుతూ, నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం ఉన్న ఆర్డర్ పత్రంను పంపించాడు. తదుపరి, ఆమె అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ "డిజిటల్ అరెస్ట్" విధానంలో వాట్సాప్ కాల్‌లోనే ఉండాలని, కాల్ కట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. తన ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని ధృవీకరణ నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించాడు.

వివరాలు 

వివిధ ఖాతాలకు రూ.99 లక్షలు బదిలీ

ఈ బెదిరింపులకు భయపడి ఆ మహిళ తన ఖాతాల నుంచి వివిధ ఖాతాలకు రూ.99 లక్షలు బదిలీ చేశారు. తరువాత ఆ వ్యక్తిని సంప్రదించే ప్రయత్నం చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గుర్తించారు. వెంటనే పుణె సిటీ సైబర్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను గుర్తించి, అవి బ్లాక్ చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

వివరాలు 

ముంబయిలో రూ.58 కోట్ల సైబర్‌ దోపిడీ వెనక విదేశీ లింకులు 

ఇక ఇటీవల ముంబయిలో జరిగిన రూ.58 కోట్ల డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెనుక విదేశీ లింకులు ఉన్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది. ఈ మోసంలో హాంకాంగ్, చైనా, ఇండోనేసియాలకు చెందిన నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. దేశంలో అతిపెద్ద సైబర్ మోసాలలో ఇదొకటిగా పరిగణిస్తున్నారు. ఇందులో నిందితులు ఈడీ అధికారులుగా నటించి, ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్త వద్ద నుంచి రూ.58 కోట్లు దోచుకున్నారని అధికారులు వివరించారు.