Mass Fish Deaths: గోదావరి నది ముఖద్వారం వద్ద చేపల మృతి వెనుక అసలు కారణం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి నది ముఖద్వారం వద్ద వేల సంఖ్యలో బంగారు తీగ (ఇండియన్ మేకెరెల్) చేపలు మృతి చెందడానికి నీటిలో ఉప్పుశాతం గణనీయంగా తగ్గిపోవడమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2024 జులైలో ఏపీలోని మసకపల్లి,బ్రహ్మపురి,యానాం పరిసర ప్రాంతాల్లో వేలాది సముద్ర చేపలు మృతిచెంది తీరానికి కొట్టుకురావడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కాయిస్), ఏపీ మత్స్యశాఖకు చెందిన స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించడంతోపాటు నీటి నమూనాలను సేకరించి చేపల మృతికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు 'ఇండియన్ జర్నల్ ఆఫ్ జియో మెరైన్ సైన్సెస్'లో ప్రచురితమయ్యాయి.
వివరాలు
ఉప్పుదనం తగ్గడంతో చేపలపై తీవ్ర ఒత్తిడి
అధ్యయనంలో భాగంగా సేకరించిన మృత చేపలు దాదాపు ఒకే పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు.
వాటి పొడవు 17 నుంచి 19 సెంటీమీటర్ల మధ్య,బరువు 72 నుంచి 78గ్రాముల వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
సాధారణంగా సముద్రపు నీటిలో ఉప్పుదనం 33పీఎస్‌యూ కంటే ఎక్కువగా ఉంటుంది.
అయితే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో మంచినీరు నదిలోకి చేరడంతో గౌతమి-గోదావరి నది ముఖద్వారం వద్ద సముద్రపు నీటి ఉప్పుదనం ఒక్కసారిగా తగ్గిపోయింది.
సముద్రపు నీటిలో జీవించేందుకు అలవాటుపడిన బంగారు తీగ చేపలకు ఈ ఆకస్మిక మార్పు తీవ్ర ప్రభావం చూపినట్లు పరిశోధనలో తేలింది.
నీటిలో ఉప్పుదనం తగ్గిపోవడంతో చేపల శరీరంలోని నీరు,లవణాల సమతుల్యత దెబ్బతిని తీవ్రమైన ఆస్మోటిక్ స్ట్రెస్ ఏర్పడింది.
వివరాలు
తక్కువ ఉప్పుదనం.. అధిక పీహెచ్‌తో అమ్మోనియా విష ప్రభావం
దీంతో చేపలు ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పరిశీలించిన నీటి నమూనాల్లో పీహెచ్ స్థాయులు 8.07 నుంచి 8.23 మధ్య ఉన్నట్లు గుర్తించారు.
నీటిలో పీహెచ్ స్థాయి పెరిగినప్పుడు అమ్మోనియా మరింత విషపూరిత రూపంలోకి మారే అవకాశం ఉంటుంది.
ఈ పరిస్థితి చేపల శ్వాసక్రియకు కీలకమైన మొప్పలపై ప్రభావం చూపుతుంది.
నది ముఖద్వారం వద్ద తక్కువ ఉప్పుదనం, అధిక పీహెచ్ కలిసి అమ్మోనియా విష ప్రభావాన్ని పెంచినట్లు శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
ఫలితంగా చేపల మొప్పలు దెబ్బతిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి చివరకు అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.
వివరాలు
చేపలు నది ముఖద్వారం వైపు ఎందుకొచ్చాయంటే?
అయితే ఆ సమయంలో బంగారు తీగ చేపలు పెద్ద సంఖ్యలో నది ముఖద్వారం వైపు ఎందుకు చేరుకున్నాయన్న అంశంపైనా శాస్త్రవేత్తలు పరిశీలించారు.
ఆ ప్రాంతంలో చేపలకు ప్రధాన ఆహారమైన ప్లాంక్టన్ సమృద్ధిగా పెరిగి ఉండటంతో అవి ఆహారం కోసం సముద్రం నుంచి నది ముఖద్వారం వైపు గుంపులుగా వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు.
అలాగే సముద్ర ప్రవాహాల ప్రభావంతోనూ చేపలు ఆ ప్రాంతానికి చేరి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.