SDM assault case: రాజస్థాన్‌లో చెలరేగిన హింస.. టోంక్‌లో 60 మంది అరెస్టు
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా, డియోలీ ఉనియారాలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతం జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్ మీనా, ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్‌డిఎం అమిత్ చౌదరిని చెప్పుతో కొట్టారు. ఈ ఘటన తరువాత హింసాత్మక సంఘటనలు తీవ్రంగా మారాయి. ఈ ఘటనపై ఫిర్యాదులు అందిన వెంటనే, పోలీసులు నరేష్ మీనాను అరెస్ట్ చేయడానికి గ్రామానికి వెళ్లగా,గ్రామస్తులు పోలీసులపై దాడి చేసి,అల్లర్లకు తెగబడ్డారు.
నరేష్ మీనా కోసం గాలింపు
నరేష్ మీనా మద్దతుదారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 60 మందిని అరెస్ట్ చేసినట్లు అజ్మీర్ రేంజ్ ఐజీ ఓం ప్రకాశ్ తెలిపారు. టోంక్ హింసాకాండపై జిల్లా అదనపు ఎస్పీ బ్రిజేంద్ర సింగ్ భాటి మాట్లాడుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రధాన నిందితుడు నరేష్ మీనా కోసం వెతుకుతున్నామని పేర్కొన్నారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేసి, పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు.