Andhra Pradesh: ఏపీలో సీ షోర్ హైవే ప్లాన్.. సముద్ర తీరం వెంట అద్భుత ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
సముద్ర తీరం వెంట ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేక అనుభూతి. అలాంటి థ్రిల్‌ను అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సముద్ర తీరాన్ని ఆనుకుని సీ షోర్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి 216 విస్తరణకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రణాళిక తెరపైకి వచ్చింది. న రసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు సుమారు 120 కిలోమీటర్ల పొడవున ఈ సీ షోర్ హైవే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి మచిలీపట్నం పోర్టు అవసరాల దృష్ట్యా గతంలో NH-216 విస్తరణపై ఆలోచనలు జరిగాయి.
వివరాలు
సముద్ర తీరం వెంట కొత్త హైవే నిర్మాణం
అయితే భూసేకరణ, నిర్మాణ వ్యయాలు అధికంగా ఉండటంతో ఇప్పుడు సముద్ర తీరం వెంట కొత్త హైవే నిర్మాణం ఆర్థికంగా మేలు చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనను మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ముందుకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి ఆమోదం తెలపడంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ సీ షోర్ హైవే నిర్మాణం వల్ల ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఆక్వా ఉత్పత్తుల రవాణా, పర్యాటక రంగాలకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. మత్స్య, వ్యవసాయ, కొబ్బరి ఉత్పత్తుల రవాణాకు ఇది కీలక మార్గంగా మారనుంది. ప్రస్తుతం జాతీయ రహదారి 216పై పెరిగిన రద్దీని తగ్గించడంలో కూడా ఈ హైవే దోహదం చేస్తుందని అంచనా.
వివరాలు
కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది
ఉప్పాడతో పాటు కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు రవాణా వేగవంతం అవుతుందని అధికారులు చెబుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ, రహదారి నిర్మాణానికి పెద్దగా అడ్డంకులు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భూసేకరణ అవసరం తక్కువగా ఉండటం ఈ ప్రాజెక్టుకు మరింత అనుకూలంగా మారింది. అయితే హైవే నిర్మాణంలో కొన్ని కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఆర్‌వోబీలు, ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ అంశాలను కూడా కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో చేర్చారు.
వివరాలు
నిజాంపట్నం పోర్టుతో కనెక్టివిటీ
ఈ ప్రాజెక్టు ద్వారా మచిలీపట్నం పోర్టును ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడమే కాకుండా, నిజాంపట్నం పోర్టుతో కూడా కనెక్టివిటీ ఏర్పడనుంది. అదనంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల మధ్య రవాణా సౌలభ్యం మెరుగుపడుతుంది. బీచ్‌లకు సులభంగా చేరుకునే అవకాశం పెరగడంతో ఈ ప్రాంతాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశముంది. దీనితో పాటు హోటళ్లు, రిసార్టులు వంటి వసతులు పెరిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.