
Godavari: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. తెల్లవారుజామున అధికారులు రెండో స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హెడ్ వర్క్స్ ఈఈజీ శ్రీనివాసరావు ప్రకారం, సముద్రంలోకి ప్రతీసెకనుకు 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, సాయంత్రం వరకు బ్యారేజీకి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు.
వివరాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ
ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం 14.10 అడుగులు చేరినట్లు నమోదు అయింది. గోదావరి నదీ కొలువులైన వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పి. గన్నవరం మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని, ఆ గ్రామాల్లోని విద్యార్థులకు తహసీల్దార్ సెలవులు ప్రకటించారు. తద్వారా, వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.