LOADING...
Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాద ముప్పుతో భద్రతా బలగాల హెచ్చరిక
జమ్మూలో ఉగ్రవాద ముప్పుతో భద్రతా బలగాల హెచ్చరిక

Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాద ముప్పుతో భద్రతా బలగాల హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

చలికాలాన్ని అవకాశంగా మలుచుకుని జమ్ముకశ్మీర్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో ప్రస్తుతం 30 మందికిపైగా పాకిస్తానీ ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 40 రోజులపాటు కొనసాగనున్న అత్యంత కఠినమైన శీతాకాల దశ అయిన 'చిల్లై కలాన్' సమయంలో భారత సైన్యం ఉగ్రవాద నిరోధక చర్యలను మరింత వేగవంతం చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఉగ్రవాదులు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల దూకుడు ఆపరేషన్ల కారణంగా ఉగ్రవాదులు కిష్ట్వార్, దోడా జిల్లాల్లోని ఎత్తైన, మధ్యపర్వత ప్రాంతాలకు పరిమితమయ్యారని రక్షణ, నిఘా వర్గాలు తెలిపాయి.

Details

దాక్కునే ప్రయత్నం చేశారు

ఈ ప్రాంతాల్లో ప్రజల ఉనికి చాలా తక్కువగా ఉండటంతో అక్కడే దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నాయి. డిసెంబర్ 21న చిల్లై కలాన్ ప్రారంభమైనప్పటి నుంచి సైన్యం మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వత ప్రాంతాల వరకూ తన కార్యాచరణ పరిధిని విస్తరించింది. ఉగ్రవాదులపై నిరంతర ఒత్తిడిని కొనసాగించేందుకు ఫార్వర్డ్ శీతాకాల స్థావరాలు, తాత్కాలిక నిఘా పోస్టులను సైన్యం ఏర్పాటు చేసింది. అడవులు, కొండలు, మారుమూల లోయలు వంటి ఉగ్రవాదులకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా గాలింపు చర్యలు చేపడుతోంది. ఉగ్రవాదులను నివాసయోగ్యం కాని భూభాగాలకు పరిమితం చేయడం, వారి సరఫరా మార్గాలను అడ్డుకోవడం, జనసాంద్రత ఉన్న ప్రాంతాల వైపు వారి కదలికలను నిరోధించడమే ఈ వ్యూహం లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

Details

 కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక టెక్నాలజీ

ఈ ఆపరేషన్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫారెస్ట్ గార్డులు, విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌లతో సన్నిహిత సమన్వయంతో కొనసాగుతున్నాయి. మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో కదలికలను గుర్తించేందుకు డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను వినియోగిస్తున్నారు. వింటర్ వార్‌ఫేర్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన యుద్ధ విభాగాలను కూడా మోహరించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.

Advertisement