Telangana: నేటి నుంచి ప్రత్యామ్నాయ పంటల విత్తనాల విక్రయం.. రైతు వేదికల్లో విక్రయం
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు నాణ్యమైన విత్తనాలను ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల రైతు వేదికల్లో నిర్వహించే రైతు మేళాల ద్వారా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను విక్రయించాలని వ్యవసాయశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావడంతో దాదాపు 32లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.
వివరాలు
1,46,963 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను సమీకరించిన ప్రభుత్వం
ఆ భూముల్లో తక్కువ నీటి వినియోగంతో పండే స్వల్పకాలిక పంటలను సాగు చేసేందుకు అనువైన విత్తనాలను రైతులకు అందించనుంది.
ఈ కార్యక్రమం కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్), భారత నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐవోఆర్), తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థల నుంచి మొత్తం 1,46,963 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం సమీకరించింది.
వివరాలు
సబ్సిడీపై ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుచూపు
రైతులకు విక్రయించనున్న ఈ విత్తనాలపై సబ్సిడీ కల్పించాలని వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.
విత్తనాల ధరపై 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని సూచించాయి.
ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల పంటల సాగు వివరాలను పరిశీలించి, అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయనుంది.
అందువల్ల విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా బిల్లును భద్రపరచుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.