Hyderabad: బాటిళ్లు,డబ్బాల్లో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకెళ్లొచ్చా? పోలీసులు ఏమన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నగరంలో దాదాపు 60 రోజుల పాటు సరిపడే పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఇంధన కొరత ఉందనే అపోహలతో ప్రజలు ఒకేసారి బంకులకు వెళ్లి వాహనాలకు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటుండటంతో డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. ఈ కారణంగా కొన్ని చోట్ల తాత్కాలికంగా "నో స్టాక్" బోర్డులు కనిపిస్తున్నాయని, దీన్ని అసలు కొరతగా భావించకూడదని సజ్జనర్ సూచించారు.
వివరాలు
బాటిళ్లు, డబ్బాల్లో పెట్రోల్ అమ్మితే కఠిన చర్యలు
ఈ నెల 22న 3,024 లీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న అది రెట్టింపై 6,400 లీటర్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ పెరుగుదల పూర్తిగా భయాందోళనల వల్లేనని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు లేదా డబ్బాల్లో లూజ్‌గా పెట్రోల్, డీజిల్ విక్రయించడం చట్ట విరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. అలాంటి చర్యలు తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ ప్రజలను భయపెట్టే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివరాలు
అధికారులు అప్రమత్తం.. నిరంతర పర్యవేక్షణ
నగరంలోని 240 పెట్రోల్ బంకులను సివిల్ సప్లై, రెవెన్యూ శాఖలతో కలిసి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరఫరా సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ,ఆయిల్ కంపెనీలు, సివిల్ సప్లై అధికారులతో కలిసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా పరిధిలోని 186 పెట్రోల్ బంకుల్లో ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, ప్రజలు అనవసరంగా బంకుల వద్ద రద్దీ సృష్టించవద్దని సూచించారు. నిత్యావసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు వాస్తవాలను గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.