
Red Fort: దేశ రాజధానిలో సంచలనం.. ఎర్రకోట నుంచి రూ.కోటి విలువైన బంగారు కలశాల దొంగతనం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట (Red Fort)లో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. అక్కడ ఇటీవల జరిగిన మతపరమైన కార్యక్రమంలో రూ. కోటి విలువ చేసే రెండు బంగారు కలశాలు(Gold Kalash)చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. సెప్టెంబర్ 3 ఉదయం ఎర్రకోట ప్రాంగణంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ప్రత్యేకంగా రెండు బంగారు కలశాలను పూజ కోసం తీసుకువచ్చారు. అయితే పూజ అనంతరం అవి కనిపించకపోవడంతో నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో జైన్ వివరించగా 760 గ్రాముల బరువున్న బంగారు కలశం, అలాగే వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో అలంకరించబడిన మరో 115 గ్రాముల చిన్న బంగారు కలశం రెండూ గల్లంతైనట్లు తెలిపారు.
Details
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు
పూజ సమయంలో ప్రముఖులు హాజరుకావడంతో కొంతసేపు పక్కకు వెళ్లిన సమయంలోనే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా, ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజాసామగ్రి ఉంచిన గదిలోకి ప్రవేశించి, రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అనంతరం అతను అక్కడి నుంచి బయటకు వెళ్లిన సన్నివేశాలు కూడా వీడియోలో కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కలశాల విలువ, వివరాలు, భద్రతా లోపాలపై కూడా విచారణ కొనసాగుతోంది.