Abhishek Banerjee: నాపై ఏడుసార్లు హత్యాయత్నాలు.. బీజేపీపై అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
పుట్టినరోజు వేడుకల వేళ తనపై బీజేపీ (BJP) కార్యకర్తలు దాడికి యత్నించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఆరోపించారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న తన నివాసంపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. గత ఆరు నెలల్లో తనను హత్య చేసేందుకు బీజేపీ నేతలు ఏడుసార్లు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజులుగా కొందరు వ్యక్తులు తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వివరాలు
తనపైనా దాడి చేసేందుకు ప్రయత్నించారు
ఆ వీడియోలో తృణమూల్ ఎంపీ పేరు ఉన్న బ్యానర్లు, పోస్టర్లను కొందరు వ్యక్తులు చించివేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
వారి వద్ద తుపాకులు కూడా ఉన్నాయని అభిషేక్ ఆరోపించారు. తన ఇంటి ముందు ఇంతటి హింసాత్మక ఘటన జరుగుతున్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఈ దాడిని ప్రశ్నించేందుకు తాను వెళ్లగా.. భాజపా కార్యకర్తలు తనపైనా దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.
గత ఆరు నెలల్లో నాపై ఏడుసార్లు హత్యాయత్నాలు జరిగినా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు.
పోలీసులు ఇలా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా దుండగులు రెచ్చిపోతున్నారు. మా పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు.
వివరాలు
పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి
ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి'' అని అభిషేక్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే టీఎంసీ ఎంపీ చేసిన ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు అభిషేక్ బెనర్జీనే ఈ దాడి నాటకానికి తెరతీశారని విమర్శించింది.
దీంతో ఈ ఘటనపై టీఎంసీ, భాజపా మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి.