Telangana: ఇదెక్కడి చలిరా బాబోయ్!.. పలు జిల్లాల్లో 8 డిగ్రీలకే పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఇంత చలేంటి బాబోయ్... అని జనాలు గజగజా వణుకుతూ రోజులు గడుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో నమోదైంది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మొత్తం 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10.1 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవడం గమనార్హం.
వివరాలు
ఈ జిల్లాల్లోని పలు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువ
వికారాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా సోమవారం, మంగళవారం, బుధవారం వరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.