Cyclone Akwan: ఏపీ తీరానికి అతి తీవ్ర తుపాను ముప్పు.. గంటకు 145 కి.మీ. వేగంతో పెనుగాలులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ తీరంపై మరో పెను తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం 'అక్వాన్' తుపానుగా బలపడి ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నవంబర్ 19న రాష్ట్ర తీరానికి చేరువయ్యే సమయానికి ఇది అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం (నవంబర్ 16) విడుదల చేసిన తాజా బులెటిన్‌లో హెచ్చరించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈ వాతావరణ వ్యవస్థ కేంద్రీకృతమై ఉంది. సోమవారం సాయంత్రానికి తుపానుగా, మంగళవారం (నవంబర్ 17) సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలపడనుంది.
వివరాలు
తన
అనంతరం వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 19 రాత్రికి అతి తీవ్ర తుపానుగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలను గుర్తించడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.
ఐఎండీ అంచనాల ప్రకారం.. ఈ తీవ్ర వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 (శుక్రవారం) మధ్యాహ్నానికి నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను అతి తీవ్ర తుపానుగా దాటే అవకాశం ఉంది.
వివరాలు
ఎప్పుడు.. ఎక్కడ తీరం దాటనుంది?
సోమవారం ఉదయం తాజా బులెటిన్ విడుదలకు ముందు ఆరు గంటల పాటు ఈ వ్యవస్థ గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలింది.
నవంబర్ 16 ఉదయం 8.30 గంటల సమయానికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 11.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 700 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 910 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. తుపాను కదలికలపై ఐఎండీ వెల్లడించిన వివరాలు ఇవి..
వివరాలు
తన
నవంబర్ 16 (సోమవారం సాయంత్రం): తుపానుగా బలపడే అవకాశం ఉంది.
నవంబర్ 17 (మంగళవారం సాయంత్రం): తీవ్ర తుపానుగా మారనుంది.
నవంబర్ 19 (గురువారం రాత్రి): అతి తీవ్ర తుపానుగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరానికి చేరువవుతుంది.
నవంబర్ 20 (శుక్రవారం మధ్యాహ్నం): నెల్లూరు, తుని మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే అవకాశం ఉంది.
వివరాలు
గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
తుపాను తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాల్లో అత్యంత బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
గంటకు 120నుంచి 130కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బలంగా వీస్తాయని స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో గాలుల వేగం ఇలా..
నవంబర్ 18: ఒడిశా తీరం వెంబడి గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవి గరిష్ఠంగా 60కిలోమీటర్ల వేగానికి చేరుకోవచ్చు. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా గాలులు వీచే అవకాశం ఉంది.
నవంబర్ 19, 20: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి.
వివరాలు
40-50 కిలోమీటర్ల వేగం
రాయలసీమలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
నవంబర్ 21: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
రాయలసీమలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
ఏపీ, ఒడిశా సహా నాలుగు రాష్ట్రాలకు వర్ష సూచన 'అక్వాన్' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
వివరాలు
1. ఆంధ్రప్రదేశ్
తుపాను ప్రభావం కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంపై అత్యధికంగా ఉండనుంది. నవంబర్ 18న అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తా ఏపీ, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇదే సమయంలో రాయలసీమలోనూ అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి. కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) స్పష్టం చేసింది. రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
2. ఒడిశా
నవంబర్ 18న రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆ రోజు తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. నవంబర్ 19 నుంచి 20వ తేదీ ఉదయం వరకు గాలుల వేగం గంటకు 50-60 కిలోమీటర్లకు, గరిష్ఠంగా 70 కిలోమీటర్లకు పెరగనుంది.
దక్షిణ ఒడిశా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇటీవల వచ్చిన 'అర్నాబ్' తుపాను సమయంలో ప్రాణనష్టం చవిచూసిన గంజాం జిల్లాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి హైఅలర్ట్ ప్రకటించారు.
వివరాలు
3. పశ్చిమ బెంగాల్
తుపాను ప్రభావంతో నవంబర్ 19 నుంచి 21 మధ్య దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సౌత్ 24 పరగణాలు, పూర్బ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, ఝార్‌గ్రామ్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.
కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున నవంబర్ 19, 20 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వివరాలు
4. తమిళనాడు, పుదుచ్చేరి
నవంబర్ 17 నుంచి చెన్నై, పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
నవంబర్ 18 నుంచి కాంచీపురం, రాణిపేట, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలతో పాటు పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
రంగంలోకి ప్రభుత్వ యంత్రాంగం.. మత్స్యకారులకు హెచ్చరికలు
తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ ఒడిశా జిల్లాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.