
Andhra News: టాటా ట్రస్ట్‌తో సహకారంతో గురుకులాలు,వసతి గృహాల్లో… సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు:మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
ఈ వార్తాకథనం ఏంటి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు,ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో నీటి పరిశుభ్రత కోసం ఇన్‌లైన్ క్లోరినేషన్ వ్యవస్థలు, అలాగే మలినజల శుద్ధి కేంద్రాలు (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేయడానికి టాటా ట్రస్ట్ ముందుకు వచ్చింది. అదేవిధంగా, ఆ వసతి గృహాలు,గురుకులాల్లో పనిచేసే వంట మనుషులకు నాణ్యమైన ఆహారం తయారీపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు సమాచారం. అదనంగా, ప్రకృతి వ్యవసాయానికి సాంకేతిక సహకారం అందించడానికి కూడా ట్రస్ట్ సిద్ధమైంది. ఈ క్రమంలో గురువారం సచివాలయంలో టాటా ట్రస్ట్ ప్రతినిధులతో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి సమావేశమయ్యారు.
వివరాలు
సాంఘిక సంక్షేమశాఖలో విప్లవాత్మక మార్పులు
ఈ సమావేశంలో మంత్రి, కుప్పం,కొండపి నియోజకవర్గాల్లోని గురుకుల పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ట్రస్ట్ ప్రతినిధులను కోరారు. అలాగే, కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాంఘిక సంక్షేమశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.