Page Loader
వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 
వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 

వ్రాసిన వారు Stalin
Aug 15, 2023
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు. సుదీర్ఘ పాదయాత్రను చేపట్టడం ద్వారా ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2021 అక్టోబర్ 20న చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల 3,800 కి.మీలు పూర్తి చేశారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 5 నాటికి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర ముగియాల్సి ఉంది. పాలేరు వరకు పాదయాత్ర చేస్తే 4,111 కిలోమీటర్లు పూర్తి అయ్యేది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న మహబూబాబాద్‌లో చేలరేగిన ఘర్షణ కారణంగా షర్మిల తన పాదయాత్రను అక్కడితో ముగించేశారు.

షర్మిల

మొదటి మహిళ‌గా షర్మిల రికార్డ్

షర్మిల చేసిన 3,800 కిలోమీటర్ల పాదయాత్ర అపూర్వమైన రికార్డుగా నిలిచింది. ఇన్ని కిలోమీటర్లు పాదయత్ర చేసిన మొదటి మహిళ‌గా ఆమెకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు మంగళవారం షర్మిలను కలిసి అరుదైన ఘనత సాధించినందుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అయితే షర్మిలకు పాదయాత్ర చేయడం ఇదేం కొత్తకాదు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. తెలంగాణలో పాదయాత్ర చేసే క్రమంలో షర్మిల సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తాలిబాన్ లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను నియంతగా అభివర్ణించారు.