Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్: శివ్‌ప్రతాప్ శుక్లా నియామకం.. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఒకేసారి 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నసి.వి.ఆనంద బోస్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. 2024 జులై 31న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్‌వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు మారారు. తాజాగా నియమించిన 9 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లలో ఐదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేశారు. ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించగా,ముగ్గురిని కొత్తగా నియమించారు.
వివరాలు
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆర్థికశాఖ సహాయమంత్రిగా సేవలు
మైనార్టీ వర్గానికి చెందిన బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సయ్యద్ అతా హస్నైన్ ను నియమించారు. 1952 ఏప్రిల్ 1న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో జన్మించిన శివ్‌ప్రతాప్ శుక్లా రాజకీయ రంగంలో విశేష అనుభవం కలిగిన నాయకుడు. ఇంతకుముందు ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆర్థికశాఖ సహాయమంత్రిగా సేవలందించారు. రుద్రాపూర్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, గోరఖ్‌పూర్‌లో కాలేజీ విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. భాజపా విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీలో చేరిన ఆయన రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచి మరింత బలపడింది.
వివరాలు
రాజ్యసభ సభ్యుడిగా
1989లో గోరఖ్‌పూర్ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి, అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ నాయకత్వంలో ఏర్పడిన భాజపా ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. తరువాత 1993, 1996లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1996లో కల్యాణ్‌సింగ్,రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016 జూన్ 10న ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం 2017 సెప్టెంబర్ 3న కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 జులై 5 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయనను 2023 ఫిబ్రవరి 18న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనను తెలంగాణ గవర్నర్‌గా బదిలీ చేశారు.
వివరాలు
ఆనందబోస్ రాజీనామాకు ఆమోదం
పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న సి.వి. ఆనందబోస్ గురువారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కీలకమైన శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డార్జీలింగ్ పర్యటనను రద్దు చేసుకుని ఆయన దిల్లీలో ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచే రాష్ట్రపతి భవన్‌కు రాజీనామా లేఖను పంపగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానిని ఆమోదించారు. గవర్నర్‌ను అకస్మాత్తుగా మార్చడం ఆశ్చర్యానికి గురి చేసిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
వివరాలు
ఏడాదిన్నరకు పైగా సేవలు
రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం బోస్‌పై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చని కూడా పేర్కొన్నారు. అసలు ఆయన పదవీకాలం 2027 నవంబర్ వరకు కొనసాగాల్సి ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు, అంటే సుమారు 20 నెలలు తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ సేవలందించారు. 2024 జులై 31న రాష్ట్రానికి నాలుగో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన పాలనలో అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కవి, రచయితగా కూడా పేరున్న ఆయన సాహిత్య కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో తెలుగులో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు.
వివరాలు
ఏడాదిన్నరకు పైగా సేవలు
గత ఏడాది మార్చి 12న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సంవత్సరం డిసెంబరులో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకంగా భావించిన తెలంగాణ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆయన ఆమోదం తెలపడంతో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా మార్గం సుగమమైంది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామపంచాయతీల విలీన బిల్లులు, జీహెచ్‌ఎంసీ విభజనకు సంబంధించిన ఆర్డినెన్సుకు కూడా ఆయన సమ్మతి తెలిపారు. అదనంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియ కూడా జిష్ణుదేవ్‌వర్మ పదవీకాలంలోనే పూర్తయింది.