శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే గత సంవత్సరం ఠాక్రేపై తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఇరు వర్గాలు పార్టీ పేరు, చిహ్నం కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఎన్నికల సంఘం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరును, 'విల్లు, బాణం'ను కేటాయించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని షిండే వర్గం స్వాగతించగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ప్రత్యేక పిటిషన్‌పై విచారణకు సిద్ధం: సుప్రీంకోర్టు
ఏక్‌నాథ్ షిండే వర్గం ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే విజయం సాధించినట్లు ధర్మాసనం పేర్కొంది. నిర్ణయం జరిగాక దానిపై స్టే ఇవ్వలేమని, యథాస్థితి కొనసాగుతుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులను షిండే వర్గానికి అటాచ్ చేయడానికి తాము సిద్ధం లేమని, తమకు ఈ విషయంలో భద్రత కావాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రత్యేక పిటిషన్‌పై విచారణకు కోర్టు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వుల్లో లేని అంశాల విషయంలో ఉద్ధవ్ ఠాక్రే శిబిరం చట్ట ప్రకారం ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని ఎస్సీ స్పష్టం చేసింది.