Train fare hike: రైల్వే ప్రయాణికులకు షాక్.. టికెట్ ఛార్జీల పెంపు ఈనెల 26 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వేశాఖ టికెట్ ధరల పెంపుపై కీలక ప్రకటన చేసింది. డిసెంబరు 26 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేస్తూనే, ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు. తాజా మార్పుల ప్రకారం లోకల్ రైళ్లు మరియు స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే ప్రయాణికులకు కూడా టికెట్ చార్జీలు పెంచలేదు. అయితే 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే ఆర్డినరీ క్లాస్ ప్రయాణికులకు కిలోమీటర్‌కు 1 పైసా చొప్పున టికెట్ ధరలు పెంచారు.
Details
కిలోమీటర్ కు రూ. 2 పైసలు చొప్పున పెంపు
అదే విధంగా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ కోచ్‌లకు కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున చార్జీలను పెంచినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ మార్పుల ప్రకారం నాన్-ఏసీ రైల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా కేవలం రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త టికెట్ ధరలు ఈ నెల డిసెంబరు 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపుతో రైల్వేశాఖకు సుమారు రూ.600 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.