#NewsBytesExplainer: పేదల అవయవాలపై వ్యాపారం.. మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక చీకటి నిజాలు
ఈ వార్తాకథనం ఏంటి
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో బయటపడిన అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ చిన్నది కాదని, విస్తృత స్థాయిలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు. విశాఖపట్టణం మధురవాడకు చెందిన 29ఏళ్ల యమున కిడ్నీ దాతగా ఒప్పుకుని మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకున్న సమయంలో మరణించడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎస్‌బిఐ కాలనీలో నడుస్తున్న ఆ ఆసుపత్రిని ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే మూసివేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. లక్షల రూపాయల లావాదేవీలు,మత్తు మందులు ఇచ్చి డొనర్లను మోసం చేసిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ముఠా తెలుగు రాష్ట్రాల పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించినట్లు పోలీసులకు సమాచారం లభించింది.
వివరాలు
వైద్యులే మాస్టర్ మైండ్లు
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్ బాలరంగడు, పుంగనూరు డయాలిసిస్ సెంటర్ ఇన్‌చార్జ్ బాలాజీ నాయక్ ఈ రాకెట్‌కు కీలక మేధావులుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు డయాలిసిస్ కోసం వచ్చే సంపన్న రోగులను టార్గెట్ చేస్తూ, "కిడ్నీ ఏర్పాటుచేస్తాం కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది" అని ఒప్పందాలు కుదుర్చుకునేవారు. వీరు విశాఖ మధురవాడకు చెందిన బ్రోకర్లు పెల్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేశ్‌లతో చేతులు కలిపారు. ఈ మధ్యవర్తులు పేదలను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని డబ్బు ప్రలోభాలతో కిడ్నీ డొనర్లుగా ఒప్పించేవారు.
వివరాలు
గ్లోబల్ హాస్పిటల్‌లో రహస్య ఆపరేషన్లు
గ్లోబల్ హాస్పిటల్‌లో డాక్టర్ అవినాష్, డాక్టర్ శశ్వతి, మధ్యవర్తి నీరజ్ కొంతకాలంగా రహస్యంగా ఈ ట్రాన్స్‌ప్లాంట్ రాకెట్ నడుపుతున్నట్లు బయటపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపి, లక్షల రూపాయల లావాదేవీలు చేసినట్టు విచారణలో తేలింది. అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు జిల్లా డీసీహెచ్‌ఎస్ అధికారిగా ఉండటంతో, తన ప్రభావాన్ని ఉపయోగించి అనుమతుల అవసరం లేకుండా ఈ కార్యకలాపాలు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా తెలుగు రాష్ట్రాలతో పాటు గోవా, తమిళనాడు ప్రాంతాల్లో కూడా అనుబంధాలు కలిగి ఉందని సమాచారం.
వివరాలు
యమున భర్త ఫిర్యాదు మేరకు..
నవంబర్ 10న విశాఖ నుంచి యమునను మదనపల్లెకు తీసుకువచ్చి, గ్లోబల్ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమె కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్‌కి ట్రాన్స్‌ప్లాంట్ చేయాలనుకున్నారు. అయితే ఆపరేషన్ సమయంలో స్ట్రోక్ రావడంతో యమున ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రి నిర్వాహకులు ఈ మరణాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించి, మృతదేహాన్ని రహస్యంగా విశాఖకు తరలించాలనుకున్నారు. కానీ భర్తకు అనుమానం రావడంతో 112 ఎమర్జెన్సీకి కాల్ చేశాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి లొకేషన్ గుర్తించిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని, ఘటనను బహిర్గతం చేశారు.
వివరాలు
పోలీసుల దర్యాప్తు - కీలక అరెస్టులు
యమున తల్లి సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. మదనపల్లె టూ టౌన్ సీఐ రాజా రెడ్డి నేతృత్వంలో డాక్టర్ అవినాష్, డాక్టర్ శశ్వతి, నీరజ్‌లను అరెస్ట్ చేశారు. అదే రాత్రి మరో ఇద్దరు బ్రోకర్లను కూడా పోలీసులు డిటైన్ చేశారు. విశాఖ మధురవాడ, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసులు రైడ్స్ కొనసాగిస్తూ, మత్తు మందులు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ముఠా కోట్ల రూపాయల టర్నోవర్ చేసినట్లు దర్యాప్తులో బయటపడుతోంది.