LOADING...
Kanpur: కాన్పూర్‌లో షాకింగ్‌ ఘటన.. లా విద్యార్థి కడుపు కోసి వేళ్లు నరికిన దుండగులు! 
కాన్పూర్‌లో షాకింగ్‌ ఘటన.. లా విద్యార్థి కడుపు కోసి వేళ్లు నరికిన దుండగులు!

Kanpur: కాన్పూర్‌లో షాకింగ్‌ ఘటన.. లా విద్యార్థి కడుపు కోసి వేళ్లు నరికిన దుండగులు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలో రోమాలు నిక్కబొడిచే దారుణం వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్‌ షాపు నిర్వాహకులు అతి క్రూరంగా దాడి చేశారు. విద్యార్థి కడుపు కోసి, చేతి వేళ్లు నరికేసేంతవరకు హింసకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు అభిజీత్‌ సింగ్‌ చందేల్‌ (22), కాన్పూర్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాఖలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మందులు కొనుగోలు చేసేందుకు సమీపంలోని ఒక మెడికల్‌ షాపుకు వెళ్లాడు. అక్కడ మందుల విషయంలో షాపు అటెండెంట్‌ అమర్‌ సింగ్‌తో మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది.

Details

బాధితుడి పరిస్థితి విషమం

ఆ సమయంలో అమర్ సింగ్ అతని సోదరుడు విజయ్‌ సింగ్‌, అలాగే ప్రిన్స్‌ రాజ్‌ శ్రీవాస్తవ, నిఖల్‌ అనే నలుగురు వ్యక్తులు అభిజీత్‌పై దాడికి దిగారు. పదునైన కత్తితో అతని కడుపు కోయడంతో పాటు చేతి వేళ్లు కూడా నరికేశారు. తీవ్ర రక్తస్రావంతో అభిజీత్‌ నేలపై కుప్పకూలాడు. ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నంలో సమీపంలోని ఒక ఇంటి వైపు పరిగెత్తాడు. అయితే దుండగులు అతన్ని వెంటాడి మరోసారి దాడి చేసి రెండు వేళ్లు నరికేశారు. అభిజీత్‌ విలపాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని అతన్ని రక్షించడానికి ముందుకు రావడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన అభిజీత్‌ను ఆస్పత్రికి తరలించారు.

Details

ఈ ఘటనపై కేసు నమోదు

బాధితుడికి 14 కుట్లు పడ్డాయని, గాయాలు తీవ్రమని వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి తల్లి నీలం సింగ్‌ చందేల్‌ మాట్లాడుతూ దాడి చేసిన నిందితులు పోలీసులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అదే రాత్రి నా మీదా, నా ప్రాణాల కోసం పోరాడుతున్న కొడుకుపైనా పోలీసులు తప్పుడు దోపిడీ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకుపై హత్యాయత్నం చేసిన వారిని పట్టుకోకుండా, తిరిగి బాధితుడినే నిందితుడిగా మార్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Details

మరో నిందితుడి కోసం గాలింపు

ఏసీపీ కుమార్‌ మాట్లాడుతూ — "హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశాం. నాల్గవ నిందితుడు ప్రిన్స్‌ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. చౌహాన్‌ ఫిర్యాదు మేరకు చందేల్‌పై మొదట దోపిడీ కేసు నమోదు చేసినప్పటికీ, దాడి వెనుక అసలు నిజాలు బయటపడిన తర్వాత కొత్త కేసు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు.