Phone taping-Radha Kishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కీలక అంశాలు చెప్పిన రాధాకిషన్ రావు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone taping) వ్యవహారం దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో కీలక నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు (Radha kishan Rao) విచారణలో మరికొన్ని అంశాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ (BRS)కు చెందిన ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి (Venkatramireddy) కి సంబంధించిన డబ్బులు తరలించడంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టారు. వెంకట్రామిరెడ్డి డబ్బు రవాణాకు ఎస్కార్ట్గా ఓ ఎస్సైను నియమించుకుని ఆయనకు తప్పుడు సమాచారమిచ్చి భారీగా నగదును తరలించినట్లు విచారణలో వెల్లడైంది.
ఎస్సైను ఎస్కార్ట్ గా నియమించారు
డబ్బు తరలింపు ప్రక్రియలో భాగంగా అవి ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావని, అత్యవసర పరిస్థితుల కోసం డబ్బును తరలిస్తున్నామంటూ పోలీసు నిఘాకు చిక్కకుండా ఆ సొమ్మును రాధాకిషన్ రావు ఓ ఎస్సై ద్వారా చేరవేసినట్లు విచారణలో తేలింది. డబ్బు తరలింపు వాహనాలకు ఎస్కార్ట్ గా నియమించిన ఎస్సైకు పలు ఆదేశాలిచ్చి పని కానిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో నే తెల్లాపూర్ లోని రాజ్ పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్ లో వెంకట్రామిరెడ్డి నివాసానికి దగ్గరగా ఉండే శివచరణ్ రెడ్డి (Siva Charan Reddy) అనే వ్యక్తిని కలవాలని సదరు ఎస్సైకు రాధాకిషన్ సూచించారని తెలుస్తోంది. ఎస్కార్ట్ గా నియమించబడిన ఎస్సైకు శివచరణ్ రెడ్డి ఒక కొత్త ఐఫోన్ ను, సిమ్ కార్డును సమకూర్చారు.
డబ్బును దివ్యచరణ్ రావుకు అప్పగించారు
ఆ ఫోన్ ద్వారా నే రాధాకిషన్ రావు ఎస్సైకు ఆదేశాలిచ్చేవారని వెల్లడైంది. అలా వెంకట్రామిరెడ్డి డబ్బును సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావుకు అప్పగించినట్లు తెలిసింది. మరోసారి అదే ఆస్పత్రి నుంచి దివ్యచరణ్రావు (Divya Charan Rao) పంపించిన వ్యక్తి ద్వారా అఫ్జల్ గంజ్ వెళ్లి అక్కడ కోటి రూపాయలు తీసుకుని తిరిగి మలక్ పేట్ లోని దివ్యచరణ్ రావుకు అందజేశారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు ఎస్కార్ట్ గా నియమించిన ఎస్సై కీలకంగా వ్యవహరించారు. మరోసారి శివచరణ్ రెడ్డి సూచించిన వ్యక్తి తో కలసి సదరు ఎస్సై ఒక ప్రాంతానికి వెళ్లి మరో కోటి రూపాయలను తెల్లాపూర్ లోని ఓ వ్యక్తి కి అప్పగించారు.
రెండు రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల రూపాయలను తరలించారు
అక్టోబర్ మూడో వారంలో రెండు రోజుల వ్యవధిలో నే రెండు కోట్లను శివచరణ్ కు ఎస్సై ఇచ్చారు. తరచూ ఈ డబ్బు తరలింపుపై సదరు ఎస్సైకి అనుమానం వచ్చినా రాధాకిషన్ రావు అతనిపై అధికారి కావడంతో ఆయనను ప్రశ్నించలేకపోయారని విచారణలో వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓటమి పాలవడంతో రాధా కిషన్ రావు తన పదవికి రాజీనామా చేసి డబ్బు తరలింపు నకు వాడిన రెండు సెల్ ఫోన్లను ఫార్మాట్ చేసేశారు. దర్యాప్తు అధికారులు వాటి నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.