Hyderabad: బటన్ నొక్కగానే మారే కారు నెంబర్ ప్లేట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మందుబాబు
ఈ వార్తాకథనం ఏంటి
చట్టాలు, నిఘా చర్యలు ఎంత కఠినంగా ఉన్నా నేరగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ముందుకెళ్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వినూత్న మోసం సామాజిక మాధ్యమాలను కుదిపేస్తూ, పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కారు నెంబర్ ప్లేట్ ఒక్క బటన్ నొక్కగానే మారిపోవడం చూసి జూబ్లీహిల్స్ పోలీసులు విస్మయానికి గురయ్యారు. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి తన ఖరీదైన కారుకు క్షణాల్లో నెంబర్ మారిపోయే ప్రత్యేక వ్యవస్థను అమర్చుకున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో మద్యం సేవించి కారు నడుపుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తనిఖీ సమయంలో కారులో అమర్చిన ఈ విచిత్ర వ్యవస్థ బయటపడటంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
వివరాలు
పలు చట్టాల కింద కేసు నమోదు
పోలీసులకు చిక్కకుండా, చలాన్లు పడకుండా ఉండేందుకు వేర్వేరు నెంబర్ ప్లేట్‌లను ఉపయోగించేలా ఈ పరికరాన్ని సిద్ధం చేసుకున్నట్లు గుర్తించారు. కారు నుంచి దిగకుండానే, కేవలం ఒక బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో నెంబర్ ప్లేట్ మారిపోయే విధంగా యంత్రాంగాన్ని అమర్చినట్టు వెల్లడైంది. ఈ వినూత్న పద్ధతి చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, ఈ మారే నెంబర్ ప్లేట్ వ్యవస్థ వెనుక ఉన్న అసలు గుట్టును వెలికితీసే పనిలో ఉన్నారు. ఈ పరికరాలను ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, మరెన్ని వాహనాల్లో ఇవి అమర్చారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో.. మద్యం మత్తులో కారు నడుపుతూ చిక్కిన వ్యక్తి
బాబోయ్.. వీడు మామూలోడు కాదు
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 12, 2026
ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడం కోసం.. డూప్లికేట్ నెంబర్ ప్లేట్లతో మాయ
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో.. మద్యం మత్తులో కారు నడుపుతూ చిక్కిన వ్యక్తి
అయితే.. నెంబర్ ప్లేట్ మార్చే ప్రత్యేక సిస్టమ్‌ను చూసి ఖంగుతిన్న పోలీసులు
వేర్వేరు ప్లేట్లతో బురిడి… pic.twitter.com/yQvyC8bxUX