LOADING...
Siddaramaiah: సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్‌బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు
సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్‌బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు

Siddaramaiah: సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్‌బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ప్రస్తుత మంత్రివర్గం కూడా తక్షణమే రద్దయింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సిద్ధరామయ్యను కోరారు. ఇక రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమై కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముందుగా జైపూర్‌కు మళ్లించాల్సి వచ్చింది.

వివరాలు

రాహుల్ గాంధీతో భేటీ

దీంతో కొంత ఆలస్యంగా ఆయన కూడా ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశానికి సిద్ధమయ్యారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీ విమానాశ్రయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సిద్ధరామయ్య సంక్షిప్తంగా స్పందించారు. శాసనసభ పక్షం, పార్టీ హైకమాండ్ కలిసి కొత్త నాయకుడిని ప్రకటిస్తాయని తెలిపారు. తనకు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై మాత్రం ఆయన స్పందించకుండా ఆ ప్రశ్నను దాటవేశారు.

వివరాలు

జూన్ 4న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

డీకే శివకుమార్ కూడా అధిష్ఠానంతో చర్చలు పూర్తైన తర్వాతే తదుపరి నిర్ణయాలు వెల్లడిస్తామని మీడియాకు తెలిపారు. ఇప్పటికీ అధికారిక ప్రకటన వెలువడకపోయినా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు దాదాపు మార్గం సుగమమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు, సిద్ధరామయ్య డిమాండ్లపై అధిష్ఠానంతో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇవి కొలిక్కి వస్తే డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 1 లేదా జూన్ 4న ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement