LOADING...
Siddaramaiah: సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. మా నాన్న తర్వాతి సీఎం ఆయనే
సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. మా నాన్న తర్వాతి సీఎం ఆయనే

Siddaramaiah: సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. మా నాన్న తర్వాతి సీఎం ఆయనే

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు మార్పు అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోన్న వేళ, రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నడిపించడానికి సతీశ్ ఝర్కిహోళి అర్హుడని, ముఖ్యమంత్రి మార్పుపై సూచనలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో గట్టి చర్చలకు కారణమయ్యాయి. బుధవారం బెళగావి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు.

వివరాలు 

వెలుగులోకి సతీశ్ ఝర్కిహోళి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో,బలమైన,ప్రగతిశీల భావన కలిగిన నాయకుడు ఆయనకు అవసరం.అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకంగా ఉంటారు.సతీశ్ ఝర్కిహోళి ఈ లక్షణాలను కలిగి ఉన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నినడిపించడానికి ఆయన సరైన వ్యక్తి.పెద్ద బాధ్యతలు అందుకునేందుకు సిద్ధంగా ఉండండి' అని చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ముఖ్యమంత్రి మార్పును సూచించేలా ఆయన ఇలా చెప్పారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ పగ్గాలు చేపట్టే అవకాశాలపై చర్చ జరుగుతుండగా,సతీశ్ ఝర్కిహోళి పేరు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే,ఈపరిణామాలపై కాంగ్రెస్ పార్టీ లేదా సిద్ధరామయ్య ఇప్పటివరకు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు.

వివరాలు 

సిద్ధరామయ్యను గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుందని భయపడుతున్న అధిష్ఠానం

రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠంలో మార్పు ఉంటుందని కాంగ్రెస్‌ (Congress) అధికారంలో వచ్చినప్పటినుంచి ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో రాజకీయ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఐదేళ్లుగా తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య చెప్పినప్పటికీ, తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్‌ చెప్పడం, మరోవైపు ఊహాగానాలు వినిపించడం జరుగుతోంది. అయితే, సిద్ధరామయ్యను తొలగిస్తే పార్టీ విభజనకు లోనవుతుందేమో అనే భయంతో అధిష్టానం జాగ్రత్తగా ఉంది. ఈ పరిస్థితుల్లో హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడడం ఆసక్తికరంగా మారింది.