LOADING...
Vijayawada: విజయవాడను విద్యావాడగా మార్చిన సిద్ధార్థ!.. స్వర్ణోత్సవాల్లో 'సిద్ధార్థ అకాడమీ' 
స్వర్ణోత్సవాల్లో 'సిద్ధార్థ అకాడమీ'

Vijayawada: విజయవాడను విద్యావాడగా మార్చిన సిద్ధార్థ!.. స్వర్ణోత్సవాల్లో 'సిద్ధార్థ అకాడమీ' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

లాభాపేక్షకు తావులేకుండా విద్యను సమాజానికి చేరువ చేయాలన్న మహత్తర ఆలోచన నుంచి ఆవిర్భవించిన సంస్థే సిద్ధార్థ అకాడమీ. ఐదు దశాబ్దాల క్రితం నాటిన ఆ విద్యా విత్తనం నేడు వటవృక్షంగా ఎదిగి, 50 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా పూర్తి చేసుకుంటూ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ అర్ధశతాబ్ద కాలంలో లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన సిద్ధార్థ అకాడమీ... క్రమశిక్షణ, నిబద్ధత, నాణ్యమైన విద్యా విధానాలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. లాభాపేక్ష లేకుండా విభిన్న రంగాల్లో విద్యాసంస్థలను నెలకొల్పి విజయవాడను 'విద్యావాడ'గా తీర్చిదిద్దింది.

వివరాలు 

 కళాశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి 

1974 నాటికి విజయవాడలో విద్యా సంస్థలు కొరవడటంతో కళాశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో నగరానికి చెందిన ప్రముఖులు వై.వి.రావు, ఎం.సుబ్బారావు కలిసి కొత్త కళాశాల స్థాపనపై ఆలోచించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నగర ప్రముఖులు సంఘంగా ఏర్పడ్డారు. ఈ ప్రయత్నంలో భాగంగా అప్పటి ప్రముఖ వైద్యుడు పిన్నమనేని వెంకటేశ్వరరావును సంప్రదించారు. ఆయన మార్గదర్శకత్వంలో 'అకాడమీ ఆఫ్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌' పేరుతో ఒక సొసైటీని రిజిస్టర్‌ చేశారు. ఈ సొసైటీకి పిన్నమనేని వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా, వై.వి.రావు కార్యదర్శిగా, ఎం.సుబ్బారావు కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

వివరాలు 

'అకాడమీ' ముందు 'సిద్ధార్థ' 

ఇదే సిద్ధార్థ అకాడమీకి పునాది అయ్యింది. అనంతరం నాటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, ప్రముఖ జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావుల సూచన మేరకు 'అకాడమీ' ముందు 'సిద్ధార్థ' అనే పేరును చేర్చారు. ఆ విధంగా 1975లో మొగల్రాజపురంలో 'సిద్ధార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌' ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది 'పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ' పేరుతో కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

క్రమశిక్షణే పునాది 

ఆరంభ దశలో వంద మంది సభ్యులు తలా రూ.10 వేలు చొప్పున అందించి విద్యాసంస్థను ప్రారంభించాలని భావించారు. అయితే అంచనాలకు మించి 250 మంది జీవితకాల సభ్యులుగా ముందుకు వచ్చారు. అకాడమీ ద్వారా వ్యక్తిగత లాభాలు పొందకూడదన్న నిబంధనను ఈ సభ్యులంతా అప్పట్లో స్వీకరించగా,నేటికీ అదే స్ఫూర్తితో కొనసాగిస్తున్నారు. ఇదే నిబద్ధతకు నిదర్శనంగా 1981లో విజయవాడలో సిద్ధార్థ అకాడమీ స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలను నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సూచన మేరకు ప్రభుత్వానికి అప్పగించారు. సిద్ధార్థ విద్యా సంస్థల నిర్వహణ కోసం జీవితకాల సభ్యుల నుంచి మూడేళ్లకోసారి 21మందితో పాలక మండలిని ఎన్నుకుంటారు. అధ్యాపకుల నియామకాల నుంచి విద్యా విధానాల అమలు వరకు ప్రతి అంశంలోనూ క్రమశిక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నారు.

Advertisement

వివరాలు 

విస్తరిస్తున్న విద్యా వృక్షం 

నేడు సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో మూడు చొప్పున ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలు, రెండు పాఠశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, మెడికల్‌, డెంటల్‌, ఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, బీఈడీ, న్యాయ విద్య, నర్సింగ్‌ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. అంతేకాదు, 2024 నుంచి 'సిద్ధార్థ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌' పేరుతో డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కూడా ప్రారంభమైంది. ఈ విద్యా సంస్థలన్నింటిలో కలిపి ప్రస్తుతం సుమారు 28 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

Advertisement