LOADING...
Singareni Shock: సింగరేణి షాక్‌.. తెలంగాణ కరెంట్ రాజస్థాన్‌కు?
సింగరేణి షాక్‌.. తెలంగాణ కరెంట్ రాజస్థాన్‌కు?

Singareni Shock: సింగరేణి షాక్‌.. తెలంగాణ కరెంట్ రాజస్థాన్‌కు?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సింగరేణి తాజా నిర్ణయం పెద్ద షాక్‌గా మారింది. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు కరెంటును ఇప్పుడు రాజస్థాన్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజస్థాన్ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)తో కలిసి 'జాయింట్ వెంచర్ కంపెనీ' (జేవీసీ) ఏర్పాటుకు సింగరేణి ముందడుగు వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EOI) టెండర్లను తాజాగా ఆహ్వానించింది. ప్రారంభంలో ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తెలంగాణ డిస్కంలకే సరఫరా చేస్తామని ప్రతిపాదించినట్లు టెండర్ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.

వివరాలు 

రాష్ట్ర అవసరాలు పెరుగుతున్న వేళ..

తెలంగాణలో థర్మల్ విద్యుత్ అవసరం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల రామగుండంలో 800మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంటు నిర్మాణానికి జెన్‌కోకు అనుమతి ఇచ్చింది. అయితే,దీనికంటే ముందే సింగరేణి గత ఏడాది పెగడపల్లిలో మరో 800మెగావాట్ల ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఇవ్వాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో,రాజస్థాన్‌లో సుమారు 1500మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి విద్యుత్‌ను పొందే విధంగా జేవీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గమే తెలంగాణకు థర్మల్ విద్యుత్ అవసరమని ప్రకటించిన నేపథ్యంలో,ఇక్కడి డిస్కంలకు ఇవ్వాల్సిన కరెంటును బయటకు పంపితే రాష్ట్ర అవసరాలు ఎలా తీర్చుకుంటారు అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.

వివరాలు 

భవిష్యత్తులో ఆర్థిక భారం పెరిగే ప్రమాదం

పెగడపల్లిలో ఇప్పటికే సింగరేణి 1200మెగావాట్ల థర్మల్ ప్లాంటును నిర్వహిస్తోంది. ఈ ప్లాంటు నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న తెలంగాణ డిస్కంలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.27,379కోట్లకు చేరాయి. ఈ భారీ బకాయిల కారణంగానే కొత్త ప్లాంటు నుంచి విద్యుత్‌ను రాజస్థాన్‌కు మళ్లించాలని కేంద్రం నిర్ణయించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత ప్లాంటుకు సమీపంలోనే భూములు అందుబాటులో ఉండటంతో కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణ వ్యయం ఒక్కో మెగావాట్‌కు సుమారు రూ.12కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పుడీ విద్యుత్‌ను ఇతర రాష్ట్రానికి మళ్లిస్తే, భవిష్యత్తులో తెలంగాణ కోసం కొత్తగా ప్లాంట్లు నిర్మించాలంటే భూముల సేకరణ అవసరం ఉంటుంది. దీంతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడే అవకాశముంది.

Advertisement