Singareni: రెండు లిస్టెడ్ కంపెనీల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సింగరేణి లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
భూగర్భ గనుల తవ్వకాలతో ప్రారంభమైన సింగరేణి సంస్థ, ఇప్పుడు ప్రపంచ స్థాయి వ్యాపార విస్తరణ దిశగా ముందడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రెండు కొత్త లిస్టెడ్ కంపెనీల స్థాపనకు సంస్థ పాలకమండలి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో ఒకటి "సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ (ఎస్‌జీఎల్)",ఇది దేశీయంగా,అంతర్జాతీయంగా కీలక ఖనిజాల అన్వేషణ,తవ్వకాలకు దారితీస్తుంది. మరో కంపెనీ "సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎస్‌ఈఎల్)",ఇది దేశంలోని సౌర,పవన విద్యుత్ ప్రాజెక్టులు,పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు,బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు(BESS)ఏర్పాటు చేసి విద్యుత్ విక్రయానికి సిద్ధమవుతోంది. ఈ రెండు సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ సింగరేణి ఇప్పటికే లేఖ రాసింది. వీటిని స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టులో చేర్చి పెట్టుబడులను సమీకరించాలనే ప్రణాళికను వెల్లడించింది.
వివరాలు
అదనంగా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100-200 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ కంపెనీలు షేర్ల విక్రయం ద్వారా నిధులు సమీకరిస్తున్న నేపథ్యంలో, సింగరేణి కూడా అదే దారిలో అడుగులు వేస్తోంది. ఇప్పటికే 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్మాణం పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా, మరో 260 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపింది. అదనంగా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు,200మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 1200మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా ఇప్పటికే లాభాలను ఆర్జిస్తున్న సింగరేణి,అక్కడే రూ.10,500కోట్లతో మరో 800మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది.
వివరాలు
వచ్చే ఐదేళ్లలో సుమారు ₹40,000 కోట్ల పెట్టుబడులు
సింగరేణి వచ్చే ఐదేళ్లలో సుమారు ₹40,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 70% నిధులను రుణాల రూపంలో సమీకరించే ఆలోచనలో ఉంది. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులతో పాటు కొత్త ఖనిజ గనుల అన్వేషణను ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో విస్తరించేందుకు కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో రాగి, బంగారం నిక్షేపాలపై అధ్యయనం చేసే కాంట్రాక్ట్ టెండర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో సింగరేణి సాధించింది. రాజస్థాన్ ప్రభుత్వ సోలార్ పార్క్‌లో 7 వేల ఎకరాలు సింగరేణికి కేటాయించింది. తెలంగాణ-రాజస్థాన్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అక్కడ 1500 నుంచి 2000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది.
వివరాలు
బొగ్గు బ్లాకుల వేలాల్లో పాల్గొని గనుల కొనుగోలు కూడా సన్నాహాలు
అదే విధంగా ఒడిశాలోని నైనీ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్కడే ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, వీటికి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల వేలాల్లో పాల్గొని గనులను కొనుగోలు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. బొగ్గు రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశం, విదేశీ దిగుమతులు పెరగడంతో సింగరేణి మార్కెట్‌లో పోటీ తీవ్రమవుతోంది.
వివరాలు
ఇతర ఖనిజాల తవ్వకాలు, విద్యుత్ వ్యాపారాల విస్తరణకు రెండు కొత్త కంపెనీలు
అంతేకాదు, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న దృష్ట్యా కేవలం బొగ్గుపైనే ఆధారపడితే రాబోయే 30 ఏళ్లలో సంస్థ నిలదొక్కుకోవడం కష్టమవుతుందని పాలకమండలి అంచనా వేసింది. అందువల్లే ఇతర ఖనిజాల తవ్వకాలు, విద్యుత్ వ్యాపారాల విస్తరణకు రెండు కొత్త కంపెనీలను లిస్టెడ్ రూపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా రూ.వేల కోట్ల పెట్టుబడులతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారని, సంస్థ సీఎండీ బలరాం వెల్లడించారు.