
YS Jagan: సింగయ్య మృతి కేసు.. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట!
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. పల్నాడు జిల్లాలోని సింగయ్య మరణానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు ఆయనను విచారించకూడదని పేర్కొంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర అటార్నీ జనరల్ (ఏజీ) కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కోరగా, దానిని అనుమతించిన హైకోర్టు విచారణను అదే కాలానికి వాయిదా వేసింది. దాంతో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
వివరాలు
పిటిషన్లపై హైకోర్టు విచారణ
ఇటీవల,పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన సింగయ్య ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అయితే, జగన్ కాన్వాయ్ కారణంగానే ఈఘటన జరిగింది అని నల్లపాడు పోలీసులు అభిప్రాయపడుతూ కేసు నమోదు చేశారు. ఈకేసును రద్దు చేయాలంటూ వైఎస్ జగన్‌తో పాటు మరికొంతమంది నాయకులు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈరోజు విచారణ సందర్భంగా,తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపి వేస్తూ ఏపీ హైకోర్టు స్టే విధించింది.కేసు విచారణలో పురోగతి ఏం ఉందని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించింది.