Half Day Schools 2026: రేపటి నుంచి ఒంటిపూట బడులు.. ఏపీ, తెలంగాణలో స్కూళ్ల కొత్త టైమింగ్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు కీలక సమాచారం. రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలోనూ మార్చి 16 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. 2025-26 విద్యా సంవత్సరానికి చివరి పని దినంగా ఏప్రిల్ 23ను నిర్ణయించిన నేపథ్యంలో, ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలను ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణలో అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి, అనంతరం వారిని ఇంటికి పంపిస్తారు.
Details
జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభం
ప్రైవేటు పాఠశాలలు కూడా ఇదే సమయాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరికి కూడా మినహాయింపు ఉండదని, మధ్యాహ్నం తర్వాత పాఠశాలలు కొనసాగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 23ను ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పని దినంగా నిర్ణయించారు. అనంతరం ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
Details
ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధానం అమలులోకి రానుంది. రాష్ట్రంలో సోమవారం (మార్చి 16) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు పోషకాహారం అందించే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అనంతరం ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు అమలులోకి రానున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.