LOADING...
SIR: త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్
త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్

SIR: త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో త్వరలోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ ప్రకటించారు. ఇప్పటివరకు ఎస్‌ఐఆర్‌ జరగని రాష్ట్రాల్లో మూడో దశలో ఈ సర్వే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే బిహార్‌లో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ కొనసాగుతోందని వెల్లడించారు. బిహార్‌లో అమలైన ఎస్‌ఐఆర్‌ విధానాన్ని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలోనూ బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు)సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని సీఈసీ సూచించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం బీఎల్‌వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థకు బీఎల్‌వోలే ప్రధాన బలమని,భారత ఎన్నికల నిర్వహణను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఆయన అన్నారు.

వివరాలు 

930 మంది ఓటర్లకు ఒక బీఎల్‌వో 

బిహార్‌లో జరిగిన ఎస్‌ఐఆర్‌ సర్వేను బీఎల్‌వోలు విజయవంతంగా నిర్వహించారని పేర్కొన్న జ్ఞానేశ్‌ కుమార్‌, ఆ సర్వే అనంతరం 7.5 కోట్ల మంది ఓటర్లతో ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఆ జాబితాలపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లపై కూడా ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. అక్కడ రీపోలింగ్‌, రీకౌంటింగ్‌ అవసరం కూడా రాలేదని వివరించారు. తెలంగాణలో సగటున ప్రతి 930 మంది ఓటర్లకు ఒక బీఎల్‌వో ఉంటారని సీఈసీ తెలిపారు. ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ పూర్తైన ప్రాంతాల్లో మరణించిన వ్యక్తుల పేర్లు, ఒక వ్యక్తికి రెండు ఓట్లు వంటి లోపాలు బయటపడినట్లు చెప్పారు. ఇలాంటి తప్పిదాలు తెలంగాణలోనూ ఉండే అవకాశముందని, ఎస్‌ఐఆర్‌ ద్వారా వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

వివరాలు 

ఏడు దేశాల నుంచి 20 మంది ప్రతినిధులు

దేశ రాజ్యాంగాన్ని కాపాడే అతి పెద్ద సైనికుడిగా బీఎల్‌వోలను ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 1.80 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారని జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడించారు. బిహార్‌ ఎన్నికలను పరిశీలించేందుకు ఏడు దేశాల నుంచి 20 మంది ప్రతినిధులు వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణలోని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు, ఓటర్ల జాబితా,ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సంబంధించిన వివరాలను రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ డిప్యూటీ సీఈసీ పవన్‌కుమార్‌ శర్మ, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, రాష్ట్ర ఉప ఎన్నికల అధికారి హరిసింగ్‌ పాల్గొన్నారు.

Advertisement

వివరాలు 

బీఎల్‌వోల సందేహాలకు వివరణ 

సమావేశంలో బీఎల్‌వోలు అడిగిన పలు ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ సమాధానాలు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గడానికి స్థానిక ఓటర్లలో ఉన్న నిరాసక్తతే ప్రధాన కారణమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఉత్సాహంగా క్యూల్లో నిలబడి ఓటు హక్కును వినియోగిస్తూ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. దేశంలో ఎన్నికలు పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతున్నాయని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

 ఏదైనా ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కు 

వలస ఓటర్లు ఏదైనా ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని ఆయన తెలిపారు. బీఎల్‌వోల గౌరవ వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచినట్లు వెల్లడించారు. ఆధార్‌ కార్డు అనేది కేవలం గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పౌరసత్వం లేదా పుట్టిన తేదీకి ఆధారంగా కాదని చెప్పారు. ఓటరు నమోదులో ఆధార్‌ కార్డు ఒక ఎంపిక మాత్రమేనని సీఈసీ స్పష్టంచేశారు.

Advertisement