PM Modi: బెంగాల్‌లో ఎస్‌ఐఆర్.. బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గనిర్దేశం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అక్కడ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కార్యాచరణ సాగుతున్న తీరుపై నేపథ్యం కలిగిన బెంగాల్ భాజపా ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా చర్చించి మార్గనిర్దేశం చేశారు. ఈ సవరణ ప్రక్రియ పూర్తిగా సరళంగా, పారదర్శకంగా ఉండేలా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఓటరినీ జాబితాలో చేర్చడం,అర్హత లేని వారికి గుర్తించి తొలగించడం ఒక్క లక్ష్యంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ విషయమే గ్రామీణస్థాయి వరకు వెళ్లేలా ప్రచారం సాగించాలని కూడా ఎంపీలను ఆదేశించారు. ప్రధాని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
రాజకీయ ట్రాప్ పడద్దు : మోదీ
ఇదే సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సంపూర్ణ సిద్ధతతో ముందుకు సాగాలని మోదీ బెంగాల్ ఎంపీలకు సూచించారు. విపక్షాలు వేస్తున్న రాజకీయ ట్రాప్ పడవద్దని, తృణమూల్ కాంగ్రెస్ గానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు గానీ ప్రస్తావిస్తూ అనవసర వాదనల్లో చిక్కుకోవద్దని హితబోధ చేశారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో భాజపా క్రమంగా ఎదుగుతున్న విధానాన్ని కూడా ప్రధానమంత్రి ఉదాహరణగా ప్రస్తావించారు. 2011లో అసెంబ్లీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలతో పరిమితమైన పార్టీ, 2021 నాటికి 65 సీట్లకు ఎదిగిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందనలు, అభిప్రాయాలను సేకరించి కేంద్రానికి తెలియజేయాలని ఎంపీలను కోరారు.
వివరాలు
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆందోళన కార్యక్రమాలు
కాగా ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా విపక్షాలు మొదటి నుంచే నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా కాకుండా 'భాజపా కమిషన్'లా వ్యవహరిస్తోందని, ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాలతో పనిచేస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం ఎన్ని సంస్థలను బెంగాల్‌లోకి తీసుకొచ్చినా, ఎంత డబ్బు కుమ్మరించినా తనను రాజకీయంగా ఓడించడం సాధ్యం కాదని గతంలోనే ఆమె హెచ్చరించారు.
వివరాలు
దేశవ్యాప్తంగా మీ పార్టీ పునాది కదిలిస్తా: మమతా
"నన్నే లక్ష్యంగా చేసుకుని బెంగాల్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటే... దేశవ్యాప్తంగా మీ పార్టీ పునాది కదిలిస్తా. గాయపడిన పులి మరింత ప్రమాదకరం" అంటూ భాజపాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తైన తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడితే ఎన్నికల సంఘం, భాజపా సృష్టించిన అయోమయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియను రెండు లేదా మూడు సంవత్సరాల వ్యవధిలో అమలు చేస్తే తాము సహకరిస్తామని కూడా ప్రకటించారు.