Andhra Pradesh: ఏపీలో SIR ప్రక్రియ పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్' జాబితాలో, తుది జాబితా ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు ముగిసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 44,71,523 మంది ఓటర్లను 'అన్ కలెక్టబుల్' (Uncollectable)గా గుర్తించారు. ఈ సంఖ్య రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 10.74 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. 'అన్ కలెక్టబుల్' జాబితాలో ఎవరెవరు? అన్ కలెక్టబుల్‌గా గుర్తించిన ఓటర్లలో మరణించిన వారు, ఆచూకీ లేని (Untraceable) ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు (Permanent Shift), అలాగే ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన డబుల్ ఎంట్రీ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
వివరాలు
జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాబితాలో అన్ కలెక్టబుల్‌గా గుర్తించిన ఓటర్ల వివరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
దీంతో తమ పేరు జాబితాలో ఉందో లేదో ఓటర్లు సులభంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుంది.
ఫామ్-6, ఫామ్-8 ద్వారా దరఖాస్తులకు అవకాశం
ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు లేదా చిరునామా మార్పు చేసుకోవాలనుకునే వారికి ఫామ్-6, ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
వివరాలు
పేరు తిరిగి నమోదు చేసుకోవాలంటే ఇవి తప్పనిసరి
అన్ కలెక్టబుల్ జాబితాలో ఉన్న ఓటర్లు తమ పేరును తిరిగి ఓటరు జాబితాలో చేర్చించుకోవాలంటే ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం (Address Proof)తో పాటు అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించారు.
అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా
అభ్యంతరాలు, సవరణలు, కొత్త దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
దీంతో రాష్ట్రంలో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తికానుంది.