LOADING...
Adultery ghee: హైకమాండ్‌ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు.. టిటిడి మాజీ ఈవోపై సిట్‌ ప్రశ్నల వర్షం 
టిటిడి మాజీ ఈవోపై సిట్‌ ప్రశ్నల వర్షం

Adultery ghee: హైకమాండ్‌ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు.. టిటిడి మాజీ ఈవోపై సిట్‌ ప్రశ్నల వర్షం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన విచారణను మరింత వేగవంతం చేసింది. వైకాపా పాలనలో తితిదే ఈవోగా పనిచేసిన ఏ.వీ. ధర్మారెడ్డిని అధికారులు మంగళవారం పిలిపించి ప్రశ్నించారు. ఉదయం 10 నుంచి రాత్రి 7.15 గంటల వరకు భోజన విరామం గంటసేపు మినహా 8.15 గంటల పాటు డీఐజీ మురళీ రాంబా, అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. కొన్నింటికి ఆయన సమాధానమివ్వగా, మరికొన్నింటికి మౌనం పాటించారు. విచారణ బుధవారం కూడా కొనసాగనుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌లను కూడా అధికారులు విచారించారు.

వివరాలు 

ఎందుకు బాధ్యతగా వ్యహరించలేదు? 

కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నా మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదని సిట్‌ అడిగినప్పుడు, "హైకమాండ్‌ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చింది" అని ధర్మారెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే ఆ హైకమాండ్‌ ఎవరో అడిగినప్పుడు ఆయన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో తితిదే ప్రత్యేకాధికారిగా పని చేసిన మీరు, ఇప్పుడు ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదని అడగగా, "2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి కృషి చేశాను" అని ఆయన సమాధానం ఇచ్చారట. సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ మైసూరు ఇచ్చిన నివేదికలో 2022 ఆగస్టులో భోలేబాబా, శ్రీ వైష్ణవి, ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ డెయిరీల నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలినా, ఆ తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగగా ధర్మారెడ్డి నిశ్శబ్దంగా ఉన్నారని సమాచారం.

వివరాలు 

ఎవరెవరికి ప్రమేయం ఉంది? 

తితిదేలో నెయ్యి, బియ్యం, జీడిపప్పు, యాలకులు, ఇతర వస్తువుల కొనుగోళ్లు ఎవరెవరి పర్యవేక్షణలో జరుగుతాయి? టెండర్లను ఖరారు చేసే ప్రక్రియలో ఎవరి పాత్ర ఉంటుంది? తనిఖీలు ఎన్ని నెలలకు జరుగుతాయి? నాణ్యతపై అనుమానాలు వచ్చినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చూపారనే ప్రశ్నలు కూడా సిట్‌ నుంచి వెల్లువెత్తాయి. ఏఆర్‌ డెయిరీ కిలో నెయ్యి రూ.318.57కే సరఫరా చేస్తామని చెప్పినప్పుడు అనుమానం రాకపోవడం ఎలా? అని అధికారులు అడగగా, కొనుగోళ్ల కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయని, సంవత్సరానికి ఒకసారి తనిఖీలు జరుగుతాయని ధర్మారెడ్డి తెలిపారు.

వివరాలు 

'మిల్క్‌' పదాన్ని ఎందుకు తొలగించారు? 

తితిదేకు నెయ్యి సరఫరా చేయాలంటే రోజూ పెద్ద మొత్తంలో పాలు సేకరించే సామర్థ్యం ఉన్న సంస్థలకే అనుమతి ఇవ్వాలనే నిబంధనల్లో 2020లో 'మిల్క్‌' అనే పదాన్ని తొలగించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని సిట్‌ ప్రశ్నించింది. భోలేబాబా డెయిరీకి అవకాశం కల్పించేందుకే ఈ మార్పు చేశారా అని అడగగా, "తాను జోక్యం చేసుకోలేదు, కమిటీ నిర్ణయం మాత్రమే" అని ఆయన చెప్పినట్లు సమాచారం. 2023 నవంబరులో మళ్లీ ఆ పదం నిబంధనల్లో చేర్చడం ఎందుకని అడగగా, "ఆ వివరాలు నాకు తెలియవు" అని సమాధానమిచ్చారు.

వివరాలు 

భోలేబాబా డైరెక్టర్లు మిమ్మల్ని కలిశారా? 

భోలేబాబా డెయిరీ ఐదేళ్లలో తిరుమలకు 68.17 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసి రూ.251.53 కోట్లు సంపాదించినట్లు సిట్‌ విచారణలో తేలిందని డీఐజీ మురళీ రాంబా తెలిపారు. ఆ సంస్థ తమ డెయిరీతో పాటు శ్రీ వైష్ణవి, ఏఆర్‌, మాల్‌గంగా సంస్థల పేర్లతోనూ సరఫరా చేసిందన్నారు. డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌లు లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. వారిని మీరు ఎప్పుడైనా కలిశారా అని అడగగా, "కాదు" అని ధర్మారెడ్డి సమాధానమిచ్చారట.

వివరాలు 

వైవీ సుబ్బారెడ్డి పాత్రపై కూడా ప్రశ్నలు 

2019 నుండి 2023 వరకు తితిదే చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి ఈ వ్యవహారంలో సంబంధం ఉందా? అని కూడా సిట్‌ విచారించినట్టు సమాచారం. అయితే కొనుగోళ్లు కమిటీ పరిధిలోనే జరిగాయని ధర్మారెడ్డి తెలిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తన పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. లడ్డూలు తీసుకోకుండా.. మధ్యాహ్న భోజన విరామంలో బయటకు వచ్చిన ధర్మారెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. జనసేన నేత కిరణ్‌ రాయల్‌ రెండు లడ్డూలు అందించేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించలేదు. రాత్రి విచారణ ముగిసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు.

వివరాలు 

భోలేబాబా డైరెక్టర్లకు కొత్త నోటీసులు 

కల్తీ నెయ్యి కేసులో భోలేబాబా డైరెక్టర్లు విపిన్‌ జైన్‌, పొమిల్‌ జైన్‌లకు సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. వారు ఎక్కడి నుంచి రసాయనాలు కొనుగోలు చేశారో, తితిదే అధికారులెవరికెవరికీ డబ్బులు చెల్లించారో వివరాలు అడిగినట్లు సమాచారం. మరో నిందితుడు అపూర్వ చావ్డా తరఫు న్యాయవాది విచారణకు హాజరైనా, అపూర్వ మాత్రం రాలేదని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఈ సంవత్సరం మే 6న నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు కాగా, రెండో ఛార్జ్‌షీట్‌ను నెలాఖరులోగా సమర్పించే అవకాశం ఉందని సిట్‌ అధికారులు తెలిపారు.