LOADING...
Six LPG Vessels: ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే.. భారత్‌కు ఆరు LPG ట్యాంకర్లు  
ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే.. భారత్‌కు ఆరు LPG ట్యాంకర్లు

Six LPG Vessels: ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే.. భారత్‌కు ఆరు LPG ట్యాంకర్లు  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. దేశంలో ఎల్పీజీ (LPG) కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయిన ట్యాంకర్లను హర్మూజ్ జలసంధి దాటించే అంశంపై ఇరాన్ అధికారులతో భారత్ చర్చలు కొనసాగిస్తోంది. ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే.. ఆరు ట్యాంకర్లు భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని సమాచారం. వాటి ద్వారా సుమారు 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి రానుంది అని అధికార వర్గాలు తెలిపాయి. భారత నౌకలకు దీర్ఘకాలిక అనుమతులు లేకపోవడంతో.. ప్రతి సారి ఇరాన్ అనుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. అంతేకాక,ప్రస్తుత అంతర్గత పరిస్థితుల కారణంగా నౌకల అనుమతులపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది.

వివరాలు 

అధికారులతో సమన్వయం

ఇదిలా ఉండగా.. ఎల్పీజీ సరఫరాతో బయలుదేరిన 'జగ్ వాసంత్', 'పైన్ గ్యాస్' ట్యాంకర్లు హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటి అంతర్జాతీయ జలాల్లోకి చేరుకున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ నౌకలు మరికొన్ని రోజుల్లో భారత్ చేరనున్నాయి. మరోవైపు, తటస్థ దేశాలకు చెందిన నౌకలు తమ అధికారులతో సమన్వయం చేసుకుంటూ హర్మూజ్ మార్గం గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ అధికారులు సహకార వైఖరిని అవలంబిస్తున్నారని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ మార్గంలో నౌకల రాకపోకలపై కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement