Gujarat: భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు
గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మాదక ద్రవ్యాల ధర రూ.450 కోట్లకు పైగానే పలుకుతోంది. ఈ కేసులో ఆరుగురు పాకిస్థానీ పౌరులను అరెస్టు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు సంయుక్తంగా పక్కా సమాచారంతో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అధికారులు సోమవారం రాత్రి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాక్ జాతీయులను పట్టుకున్నారు. ఈ క్రమంలో సోదాలు నిర్వహించగా.. రూ.450 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ పట్టుబడింది. గత 30 రోజుల్లో గుజరాత్ తీరంలో పట్టుబడిన రెండో భారీ రాకెట్ ఇది.
ఫిబ్రవరి 28న 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత
అంతకుముందు ఫిబ్రవరి 28న గుజరాత్ తీరంలో పాకిస్థాన్ సిబ్బంది నడుపుతున్న పడవలో కనీసం 3,300 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ రూ.2,000 కోట్లకు పైగానే ఉంది. భారత ఉపఖండంలో ఇదే అతిపెద్ద మాదక ద్రవ్యాల స్వాధీనం కావడం గమనార్హం. ఇండియన్ కోస్ట్ గార్డ్ గతంలో కూడా సముద్రంలో జరిగిన పలు ఆపరేషన్లలో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను అరికట్టే లక్ష్యంతో ఎన్‌సీబీ అధికారులు సముద్ర తీరాలపై ప్రత్యేక నిఘాను ఉంచారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతోంది.