TGSRTC: ఆర్టీసీ డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష.. రెండు అత్యాధునిక సిమ్యులేటర్ల కొనుగోలుకు నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
డ్రైవింగ్‌లో ఒక చిన్న తప్పిదం.. రెప్పపాటులో ప్రాణాల మీదకు తెస్తుంది. స్టీరింగ్‌పై డ్రైవర్‌కు పట్టుఏమాత్రం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చేవెళ్లలో జరిగిన ప్రమాదం మళ్లీ నిరూపించింది. ఆ ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ తప్పిదమే కారణమైనా, ప్రాణాలు కోల్పోయింది మాత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న అమాయక ప్రజలే. ఈ నేపథ్యంలో,ఇతర వాహన డ్రైవర్ల పొరపాట్ల వల్ల జరిగే ప్రమాదాల నుంచి ప్రయాణికులను రక్షించేందుకు,ఆర్టీసీ డ్రైవర్ల డ్రైవింగ్ సామర్థ్యం,అప్రమత్తతను మరింతగా బలపరచాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం డ్రైవర్లకు శాస్త్రీయ విధానంతో శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో,అత్యాధునిక డ్రైవింగ్ సిమ్యులేటర్లను తీసుకురావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అధికారులకు ఆదేశించారు. డిసెంబర్ చివరి వారంలోపు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌లలోని ఏ రెండు కేంద్రాలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
వివరాలు
తెరపై ప్రమాదాలు..
ఒక్క సిమ్యులేటర్ ధర సుమారు రూ. 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ఇది అసలు బస్సు కెబిన్‌లా రూపొందించబడుతుంది. ఇందులో డ్రైవర్ సీటు, స్టీరింగ్, గేర్లు, క్లచ్ అన్నీ పనిచేసే విధంగానే ఉంటాయి. తెరపై రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితులు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. డ్రైవర్ ఎలా నడుపుతున్నాడో బట్టి రోడ్డుపై వాహనాల కదలిక మారుతూ ఉంటుంది. శిక్షణలో భాగంగా అకస్మాత్తుగా ఎదురుగా వాహనం రావడం, భారీ వర్షం, రాత్రి చీకటి, ప్రమాదకర మలుపులు, ఉత్థానపతనాలున్న రోడ్లు వంటి వివిధ పరిస్థితులు తెరపై చూపిస్తారు. వీటిని డ్రైవర్ ఎంత త్వరగా, ఎంత తెలివిగా ఎదుర్కొంటాడో సిస్టమ్ రికార్డు చేస్తుంది.
వివరాలు
తెరపై ప్రమాదాలు..
ఆ డేటా ఆధారంగా డ్రైవర్ ఎక్కడ తప్పు చేశాడో వివరంగా చెప్పి, దిద్దుబాటు సూచనలు ఇస్తారు. ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదాలను అరికట్టేందుకు డ్రైవరు ఎలా స్పందిస్తున్నాడో విశ్లేషించి, అవసరమైన చోట అదనపు శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఎక్కువ ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు హకీంపేట్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.