Chandrababu: నైపుణ్యాభివృద్ధితోనే రాష్ట్ర,దేశ ప్రగతి: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
దేశాభివృద్ధిలో రాబోయే రెండు దశాబ్దాలు అత్యంత కీలకమైనవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థల్లోనూ విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఈ మార్పులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన 'మిషన్ కర్మయోగి' దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రసంగించారు.
వివరాలు
ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపులో ఏపీకి అగ్రస్థానం
ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంచడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
దీనికి సంబంధించిన పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి అందుకున్నారు.
ఈ విభాగంలో కర్ణాటక రెండో స్థానంలో, ఒడిశా మూడో స్థానంలో నిలిచి అవార్డులు స్వీకరించాయి.
వివరాలు
ప్రజాసేవలో మార్పే శిక్షణకు కొలమానం
శిక్షణ అంటే కేవలం ధ్రువపత్రాలు పొందడం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలు ప్రజలకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడంలో కనిపించాలని అన్నారు.
రెవెన్యూ అధికారి ఒక సమస్యను మరింత వేగంగా పరిష్కరించడం,ఉపాధ్యాయుడు మెరుగైన రీతిలో బోధించడం వంటి సానుకూల మార్పులే శిక్షణకు అసలైన కొలమానాలని వివరించారు.
సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత నిబంధనలు,అనవసరమైన పేపర్‌వర్క్‌ను కొనసాగించడం సమంజసం కాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పాలనా ప్రక్రియలను సమూలంగా సంస్కరించి, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వివరాలు
పాలనలో ఏఐ వినియోగాన్ని పెంచాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో విస్తృతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపకుండా, 'ఐగాట్-మిషన్ కర్మయోగి' వేదికను ఉపయోగించుకుని తమ వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం కేవలం నియంత్రణ వ్యవస్థగా కాకుండా ప్రజలను సాధికారత దిశగా నడిపించే వ్యవస్థగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
సమర్థవంతమైన పాలన, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగంతో 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతీయ సదస్సులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.