Loading...
Telangana: సోలార్‌ పథకంలో తెలంగాణకు స్లో ప్రోగ్రెస్‌.. దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకంజ
సోలార్‌ పథకంలో తెలంగాణకు స్లో ప్రోగ్రెస్‌.. దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకంజ

Telangana: సోలార్‌ పథకంలో తెలంగాణకు స్లో ప్రోగ్రెస్‌.. దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకంజ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇళ్లపై సౌర విద్యుత్‌ ఫలకాలు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్‌ను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్‌ యోజన' అమలులో తెలంగాణ రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ నుంచి ఇప్పటివరకు 87,267 దరఖాస్తులు మాత్రమే అందాయి. వాటిలో 55,974 ఇళ్లలో సౌర ఫలకాల ఏర్పాటు (ఇన్‌స్టలేషన్లు) పూర్తయ్యాయి. వీటి ద్వారా సుమారు 206 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.331.98 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది.

వివరాలు

రాష్ట్రం ప్రభుత్వం చొరవ చూపడం లేదు

అందిన దరఖాస్తుల్లో సుమారు 64 శాతం ఇన్‌స్టలేషన్లు పూర్తి చేయడం ద్వారా తెలంగాణ ఫర్వాలేదనిపించినప్పటికీ, మరింత మంది వినియోగదారులు ఈ పథకం ప్రయోజనాలను పొందేలా అవగాహన కల్పించడం, వారిని ఆకర్షించడం వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ చూపడం లేదని పథకం అమలును పర్యవేక్షిస్తున్న అధికారులు పేర్కొంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉంది. కేరళలో 3.12 లక్షల ఇన్‌స్టలేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 2.76 లక్షలు, తమిళనాడులో 87 వేల ఇన్‌స్టలేషన్లు పూర్తవగా, ఈ విషయంలో తెలంగాణ వాటి కంటే వెనుక స్థానంలో ఉంది.

వివరాలు

లబ్ధిదారులకు ఆకర్షణీయమైన సబ్సిడీ

పీఎం సూర్యఘర్‌ యోజన కింద లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీ అందిస్తోంది.

1 కిలోవాట్‌ సామర్థ్యం గల వ్యవస్థకు రూ.30 వేల వరకు, 2 కిలోవాట్లకు రూ.60 వేల వరకు, 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర వ్యవస్థకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందజేస్తోంది.

ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు విద్యుత్‌ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే అవకాశం కలుగుతోంది.

ADVERTISEMENT