World-Class Library: అమరావతిలో వరల్డ్-క్లాస్ లైబ్రరీ.. దుబాయ్ శోభా రియాల్టీ రూ.100 కోట్లు విరాళం!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అక్కడ శోభా రియాల్టీ చైర్మన్ రవి మీనన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమరావతిలో లైబ్రరీ నిర్మాణానికి సంబంధించిన వివరణలు,ప్రణాళికలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని నిర్మించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. శోభా రియాల్టి సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలపై కూడా వివరించారు. రాజధాని అభివృద్ధిలో శోభా రియాల్టీ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు.
వివరాలు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు
చంద్రబాబు, శోభా గ్రూప్ ప్రతినిధులకు, ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించాలని సూచించారు. దేశవ్యాప్తంగా రూపొందుతున్న ప్రపంచ స్థాయి నగరాల తరహానే అమరావతిని కూడా ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. అలాగే గ్రీన్ ఎనర్జీని రాష్ట్రానికి ప్రాధాన్యతగా తీసుకొచ్చే ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో పాటు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. తిరుపతి, విశాఖ వంటి ప్రధాన నగరాల్లో భవిష్యత్తులో అనేక మార్పులు, అభివృద్ధి పనులు జరగనున్నాయి. మౌలిక సదుపాయాలపై పెద్దగా ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ఏపీ రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని కూడా ముఖ్యమంత్రి తెలిపారు.
వివరాలు
ఆదాయంలో 50%ను సమాజ సేవ కోసం..
రియల్టీ రంగంలో మాత్రమే కాదు, ఏపీకి పోర్టులు, కారిడార్లు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, హౌసింగ్ ప్రాజెక్టులు వంటి విస్తృత అవకాశాలున్నాయని చంద్రబాబు వివరించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో బిజినెస్, ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులు మొదలగునవి చేపట్టవచ్చని సూచించారు. శోభా రియాల్టీ సంస్థ చేస్తున్న చారిటీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందించారు. తమ ఆదాయంలో 50%ను సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నట్టు, జీరో పావర్టీ మిషన్ వంటి ప్రభుత్వ పథకాలను అనుసరిస్తూ అమలు చేస్తున్నట్టు వివరించారు.
వివరాలు
విశాఖలో పెట్టుబడుల సదస్సుకు శోభా గ్రూప్ కు సీఎం ఆహ్వానం
శోభా గ్రూప్ దుబాయ్‌తో పాటు ఓమన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై వంటి దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నదని రవి మీనన్ ముఖ్యమంత్రి కి వివరించారు. భారత్‌లో 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో సంస్థ ప్రాజెక్టులు చేస్తున్నట్టు, ప్రత్యేకంగా బెంగుళూరు, గుర్గాం, చెన్నై, కేరళలో హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. చంద్రబాబు, వచ్చే నెల నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగనున్నట్టు, ఆ సదస్సులో పాల్గొనాలని శోభా గ్రూప్ ను ఆహ్వానించారు.