LOADING...
LPG: ఎల్‌పీజీ స‌మ‌స్య‌కు పరిష్కారం.. పీఎన్‌జీకి మారాలని 60 లక్షల కుటుంబాలకు కేంద్రం పిలుపు
ఎల్‌పీజీ స‌మ‌స్య‌కు పరిష్కారం.. పీఎన్‌జీకి మారాలని 60 లక్షల కుటుంబాలకు కేంద్రం పిలుపు

LPG: ఎల్‌పీజీ స‌మ‌స్య‌కు పరిష్కారం.. పీఎన్‌జీకి మారాలని 60 లక్షల కుటుంబాలకు కేంద్రం పిలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న అనుమానాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్యాస్ పైప్‌లైన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 60 లక్షల కుటుంబాలు పీఎన్‌జీ వైపు మారాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరింది. పీఎన్‌జీ వాడితే సిలిండర్లను బుక్ చేయడం, డెలివరీ కోసం వేచి చూడడం వంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం తెలిపింది.

Details

పీఎన్‌జీతో నిరంతర గ్యాస్ సరఫరా

ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 కోట్ల మంది పీఎన్‌జీ వినియోగదారులు ఉన్నారని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శ‌ర్మ తెలిపారు. వీరికి ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరుగుతోందని చెప్పారు. అదనంగా మరో 60 లక్షల ఇళ్లకు పీఎన్‌జీ పైప్‌లైన్లు సమీపంలోనే ఉన్నాయని, వారు సులభంగా కనెక్షన్ పొందవచ్చని వివరించారు. ఇది ఎల్పీజీపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నారు . వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ ఉపయోగించే వ్యాపారులు తమ సమీపంలోని సిటీ గ్యాస్ పంపిణీ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

Details

ఆందోళన వద్దు.. పానిక్ బుకింగ్స్ తగ్గించండి

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా ఆగిపోతుందనే పుకార్లతో ప్రజలు ముందస్తుగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా రోజుకు సుమారు 55 లక్షల బుకింగ్స్ జరుగుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 76 లక్షలకు పెరిగిందని అధికారులు తెలిపారు. అయితే దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు అనవసరంగా భయపడి ముందస్తు బుకింగ్స్ చేయవద్దని సుజాత శర్మ స్పష్టం చేశారు.

Advertisement

Details

యుద్ధం ప్రభావం ఎంత?

భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో దాదాపు 90 శాతం గ్యాస్ హ‌ర్ముజ్ జ‌లసంధి ఈ మార్గం ద్వారా వస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఈ మార్గంలో రవాణాకు కొన్ని ఇబ్బందులు తలెత్తిన విషయం నిజమేనని అధికారులు తెలిపారు. అయితే దీనికి ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశీయ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని 30 శాతం వరకు పెంచాలని ఆదేశించిందని వెల్లడించింది. ఇది దేశీయ అవసరాలకు సరిపోతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 33.37 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి.

Advertisement

Details

రవాణా రంగానికి 100 శాతం ప్రాధాన్యత

పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం, మార్చి 9న నిత్యావసర వస్తువుల చట్టం కింద సహజ వాయువు కేటాయింపులో గృహ అవసరాలు, రవాణా రంగానికి 100 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రజలకు నిరంతర గ్యాస్ సరఫరా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.

Advertisement