
Telangana: ఈ నెల 15 నుండి సోమశిల నుంచి శ్రీశైలంకి లాంచీ యాత్ర ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణ సేవలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. గత కొన్ని రోజుల్లో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గి నీటి మట్టం స్థిరంగా ఉండటంతో పర్యాటక శాఖ అధికారులు ఈ ప్రయాణ సేవలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ''ఈ నెల 15 లేదా 16 నుండి బుకింగ్‌ల ఆధారంగా లాంచీ ప్రయాణ సేవ ప్రారంభం కానుందని పర్యాటక శాఖ సోమశిల యూనిట్ ఇన్‌ఛార్జి బత్తిని ప్రేమ్‌కుమార్‌గౌడ్ బుధవారం తెలిపారు.
వివరాలు
120 మందికి ప్రయాణానికి అనుకూలంగా డబుల్ డెక్కర్ ఏసీ లంచ్
ఒకేసారి 120 మందికి ప్రయాణానికి అనుకూలంగా డబుల్ డెక్కర్ ఏసీ లాంచీ ఏర్పాటు చేశాం. సోమశిల నుంచి శ్రీశైలానికి ప్రయాణించే పెద్దల టికెట్ ధర రూ.2,000గా,చిన్నారుల టికెట్ ధర రూ.1,600గా నిర్ణయించాం. అలాగే,శ్రీశైలం నుంచి సోమశిలకు కూడా ఇదే ధరలు వర్తిస్తాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు లాంచీ ప్రయాణం ప్రారంభమై, సుమారు 7 గంటల అనంతరం పాతాళ గంగ ఏరియా కృష్ణగిరి (ఈగలపెంట)బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి భక్తులు, పర్యాటకులు వాహనాల్లో శ్రీశైలం దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో మధ్యాహ్న భోజనం, టీ, బిస్కెట్లు అందజేస్తామని కూడా ఆయన వివరించారు. దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేకంగా లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు చేశామని,పర్యాటకులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.