LOADING...
Sonam Wangchuk: లద్దాఖ్‌లో ఆందోళనలు.. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్ 
లద్దాఖ్‌లో ఆందోళనలు.. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్

Sonam Wangchuk: లద్దాఖ్‌లో ఆందోళనలు.. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

లద్దాఖ్‌లో చోటు చేసుకున్న అల్లర్ల కు కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, వాంగ్‌చుక్ చేసిన ప్రకటనలు రెండు రోజుల క్రితం లేహ్‌లో ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయని పేర్కొన్నారు. ఆ ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 90 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు 

రెండు వారాలుగా నమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష

కొంతకాలంగా లద్దాఖ్‌లో రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను మూడు సంవత్సరాలుగా నిరసిస్తూ, తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ రెండు వారాలుగా నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌ కింద చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమం మధ్య కొన్ని రోజులుగా ఆందోళనకారులు, పోలీస్ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలలో నలుగురు మృతి చెందాగా.. అనేక మంది గాయపడ్డారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ పరిస్థితులకు వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు కారణమని పేర్కొంది.

వివరాలు 

నన్ను బలిపశువును చేశారు: వాంగ్‌చుక్

24 గంటలు తిరగకముందే ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'ది స్టూడెంట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూమెంట్‌ ఆఫ్‌ లద్దాఖ్‌'కు పై చర్యలు చేపట్టింది. ఆ సంస్థపై ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల నియంత్రణ చట్టం ఉల్లంఘన వంటి ఆరోపణలతో లైసెన్స్ రద్దు చేసింది. అయితే వాంగ్‌చుక్ గురువారం చేసిన ప్రకటనలో, లద్దాఖ్ ఆందోళనకు అతని పేరును మూల కారణంగా చెప్పడాన్ని తప్పుబట్టారు. అసలు సమస్యను పక్కనపెట్టి అతన్ని "బలిపశువుగా" మార్చారని ఆయన ఆరోపించారు. ఇది ఎంతమాత్రం తెలివైన నిర్ణయం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం.