Sonia Gandhi: పౌరసత్వానికి ముందే పేరు నమోదు? సోనియా గాంధీకి రౌజ్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు..!
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీలోని రౌజ్ అవెన్యూ సెషన్స్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈవిచారణ అనంతరం కోర్టు సోనియా గాంధీకి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ నారంగ్ కోర్టులో వాదనలు వినిపిస్తూ..సోనియాగాంధీకి పౌరసత్వం వచ్చేముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చారని, దీని వెనక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
వివరాలు
సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించకముందే..
ఈ అంశంపై తిరిగి సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోరారు. 1980లోనే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయడానికి కొంతమంది నకిలీపత్రాలు సృష్టించి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించి, తిరిగి 1983లో మళ్లీ చేర్చారని తెలిపారు. ఇవన్నీ కూడా సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించకముందే జరిగాయన్నారు. ఈ విషయాలకు సంబంధించి కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ వాదనలు,సమర్పించిన ఆధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు..ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని సోనియా గాంధీతో పాటు దిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది.
వివరాలు
వచ్చే ఏడాది జనవరి 6న తదుపరి విచారణ
ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6న జరగనుంది. ఇక ఇదే అంశంపై గతంలో మెజిస్ట్రేట్ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. ఎన్నికల చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. అయితే, అప్పట్లో మెజిస్ట్రేట్ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, తాజా నోటీసుల జారీకి మార్గం సుగమం అయ్యింది.