Ghaziabad: ఇల్లు ఖాళీ చేయమని అడిగినందుకు.. సుపారీ ఇచ్చి తండ్రిని చంపించిన కొడుకులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి యోగేష్ (58)హత్య కేసులో పోలీసులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఈహత్యకు యోగేష్ స్వయంగా పెంచిన కుమారులే కారణమని దర్యాప్తులో తేలింది. తండ్రిని హతమార్చేందుకు వారు సుపారీ కిల్లర్లను నియమించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. డిసెంబర్ 26న లోనీ ప్రాంతంలోని అశోక్ విహార్ కాలనీలో యోగేష్ ఇంటికి తిరిగి వస్తుండగా,బైక్‌పై వచ్చిన ఇద్దరుదుండగులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడికక్కడే చంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...యోగేష్ తనఇంట్లో నివసిస్తున్న కుమారులను ఆ ఇంటిని ఖాళీ చేయాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఆస్తిపై ఆశతో పాటు ఇల్లు విడిచిపెట్టడం ఇష్టం లేని కుమారులు,తండ్రిని అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో హత్యకు కుట్ర పన్నారు.
వివరాలు
ఒకరి అరెస్ట్.. పరారీలో ఉన్న కుమారులు, కానిస్టేబుల్ కోసం గాలింపు
ఈ పథకంలో భాగంగా తమ పొరుగువాడైన అరవింద్(32)కు సుపారీ ఇచ్చారు. అరవింద్ తన బావమరిది నవీన్‌తో కలిసి ఈ హత్యను అమలు చేశాడు. నవీన్ కౌశాంబి జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈకేసులో బుధవారం సాయంత్రం అరవింద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పిస్టల్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ సమయంలో యోగేష్‌పై కాల్పులు జరిపింది తానేనని అరవింద్ అంగీకరించాడు. ఘజియాబాద్ కోర్టు అతడిని 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇదిలా ఉండగా,యోగేష్ ఇద్దరు కుమారులు,కానిస్టేబుల్ నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.