AP ELECTIONS : మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలంటూ లీక్
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 గెలుచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అంబటి, అక్టోబర్ 26 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. మరోసారి జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే అంశం మీద కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. తమకు ఎవరి మీద కక్షసాధింపులు అక్కర్లేదని, ఎన్నికల ముందు కక్ష సాధింపు చర్యలు ఏమిటన్నారు. ఆధారాలు లభించిన కారణంగానే చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని అంబటి అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఏం బలం ఉందని టీడీపీకి మద్దతిస్తారని ప్రశ్నించారు.ఆ పార్టీని కాపాడటం ఎవరి వల్లా కాదన్నారు.
టీడీపీ అగ్రనాయకత్వంపై మంత్రి అంబటి తీవ్ర ఆరోపణలు
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ల మీద మంత్రి అంబటి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు బాబు, లోకేష్ ఇద్దరూ వేల కోట్లను దోచుకున్నారన్నారు. అసలు టీడీపీ పార్టీ నాశనం కావడానికి కారణం లోకేషేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్‌తో పెట్టుకుంటే రియాక్షన్ ఇలాగే ఉంటుందన్న విషయం ఇకనైనా చంద్రబాబుకు అర్థమై ఉంటుందని భావిస్తున్నట్లు అంబటి రాంబాబు చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డే తనను ఏం చేయలేకపోయారు, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఓ బచ్చా, ఆయనేం చేస్తాడని గతంలో బాబు చేసిన వ్యాఖ్యలను అంబటి గుర్తు చేవారు.