త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!.. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి?
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రికి పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. అయితే సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కలేదు.
దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు త్వరలో మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరును పోటీ చేయాలని పట్నం అనుకున్నారు. కానీ ఆ సీటును పైలెట్ రోహిత్ రెడ్డికి కేసీఆర్ కేటాయించారు.
తాండూరు నుంచి కుదరకపోతే, వికారాబాద్, పరిగి, చేవేళ్ల, షాద్ నగర్ నుంచైనా పోటీ చేయాలని ఆయన అనుకున్నారు. కానీ కుదరలేదు.
ఈక్రమంలో ఒక దశలో ఆయన పార్టీ కూడా మారాలనుకున్నారు. కానీ మధ్యవర్తిత్వంతో ఆలోచనను విరమించుకున్నారు.
కేసీఆర్
ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత ఖాళీగా కేబినేట్ స్థానం
సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాతే పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆయన కోసం ప్రత్యేకంగా కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత ఒక కేబినెట్ స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారట.
మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ఈ తక్కువ కాలంలో మంత్రి పదవి వచ్చినా, ఆయన ఏ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.