South Central Railway: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. ప్రతి రైల్లో నాలుగు జనరల్ బోగీలు!
దక్షిణ మధ్య రైల్వే తెలిపిన ప్రకారం, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచే ప్రణాళికను చేపట్టింది. ప్రస్తుతం, రెండు జనరల్ బోగీలున్న రైళ్లలో ఈ సంఖ్యను నాలుగుకు పెంచాలని నిర్ణయించుకుంది. ఈ కొత్త కోచ్‌లు ఎల్‌హెచ్‌బీ (లాంగ్ హాలీ బాడీ) పరిజ్ఞానంతో తయారుచేసిన కోచ్‌లు అవుతాయని రైల్వే వివరించింది. జోన్ పరిధిలో 21 జతల రైళ్లకు అదనంగా 80 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని బుధవారం ప్రకటించారు.
కొత్త రూపం.. అధిక సీట్లు
రైళ్లలో పేద ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే జనరల్ బోగీల రూపాన్ని మారుస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువ భాగం పాతకాలం నాటి సాధారణ బోగీలే ఉండేవి. అయితే, అనేక రైళ్లలో రెండు జనరల్ బోగీలుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, రైల్వే బోర్డు జనరల్ బోగీల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంది. ఇప్పుడు అందుబాటులోకి రానున్న కొత్త బోగీలు ఎల్‌హెచ్‌బీ పరిజ్ఞానంతో తయారయ్యాయి. పాత ఐసీఎఫ్ బోగీల్లో 90 సీట్లు ఉండగా, ఎల్‌హెచ్‌బీ బోగీల్లో 100 సీట్లు ఉంటాయి. దీని ద్వారా ఎక్కువ మంది ప్రయాణించవచ్చు, అలాగే ప్రమాదాల సమయంలో నష్టం కూడా తక్కువగా ఉంటుంది.
జోన్ పరిధిలో 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 66 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
ఏసీ,స్లీపర్ క్లాసులలో ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వే శాఖ ఇప్పటికే ప్రవేశపెట్టింది.ఇప్పుడు జనరల్ క్లాస్‌లో కూడా ఈ కోచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం,జోన్ పరిధిలో 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 66 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు జతచేయబడ్డాయి. గౌతమి, దక్షిణ్, నారాయణాద్రి వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ జనరల్ కోచ్‌లు చేర్చబడ్డాయి. ద.మ. రైల్వే తెలిపినట్లుగా, దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ బోగీలను దశలవారీగా జత చేస్తోంది. ఈ మార్పులతో, రోజుకు 70,000 మంది ప్రయాణికులు అదనంగా జనరల్ బోగీల్లో ప్రయాణించే అవకాశం కలుగుతుంది. సాధారణ ప్రయాణికుల ప్రయాణాన్ని అధిక ప్రాధాన్యం ఇస్తామని ద.మ. రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.