LOADING...
South Central Railway: 'సనత్‌నగర్‌-సికింద్రాబాద్‌-మౌలాలి' విస్తరణ.. రాష్ట్ర ప్రభుత్వానికి ద.మ.రైల్వే ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వానికి ద.మ.రైల్వే ప్రతిపాదనలు

South Central Railway: 'సనత్‌నగర్‌-సికింద్రాబాద్‌-మౌలాలి' విస్తరణ.. రాష్ట్ర ప్రభుత్వానికి ద.మ.రైల్వే ప్రతిపాదనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగర మధ్య భాగంలో ముఖ్యమైన రైల్వే మార్గాన్ని విస్తరించడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం సనత్‌నగర్ నుండి సికింద్రాబాద్,ఆ తర్వాత మౌలాలి క్యాబిన్ వరకు రెండు రైలు మార్గాలు ఉన్నాయి. భవిష్యత్తులో రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని,రైల్వే శాఖ ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించడానికి యోచిస్తోంది. ఈప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించారు.సనత్‌నగర్-సికింద్రాబాద్-మౌలాలి మార్గం సుమారు 21 కిలోమీటర్ల పొడవు కలిగినది. ఈ మార్గంలో రైలు ట్రాక్ కు ఇరువైపులా 20 మీటర్ల పరిధిని 'ప్రత్యేక రైల్వే జోన్‌'గా ప్రకటించాలని ద.మ. రైల్వే శాఖ తాజా విజ్ఞప్తి చేసింది. విస్తరణ ప్రాజెక్ట్‌ను సజావుగా చేపట్టడానికి భూసేకరణ సులభతరం చేయడానికి ఈ ప్రతిపాదన తీసుకు వచ్చారు.

వివరాలు 

మెరుగుపడనున్న రైల్వే రవాణా.. 

ప్రస్తుతం ఈ మార్గంలో కేవలం రెండు రైలు మార్గాలు ఉండటంతో,దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు చేసే రైళ్లు నగర పరిధిలో ఎక్కువ సమయం ఆగాల్సి వస్తోంది. వరంగల్, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లు చర్లపల్లి వరకు వేగంగా వచ్చినా అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఘట్‌కేసర్ నుండి చర్లపల్లి వరకు ఇప్పటికే నాలుగు లైన్‌ల మార్గం ఉండటంతో ఆ దిశలో రైళ్లు వేగంగా ప్రయాణించగలవు. అయితే,నగర శివారాల్లో రైళ్లు ఎక్కువ సేపు ఆగడం వల్ల ప్రయాణికులు,సరుకు రైళ్లు రెండింటికి కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత పెరుగుతుందని అంచనా వేసి, ద.మ. రైల్వే శాఖ సానుకూలంగా ఈ మార్గాన్ని నాలుగు లైన్‌లుగా విస్తరించాలని ప్రతిపాదించింది.

వివరాలు 

ఎలాంటి ప్రభావం ఉంటుంది? 

2047 నాటికి పెరిగే రద్దీ అంచనాల్ని రూపొందించింది. ట్రాక్ చుట్టూ ఇరువైపులా 'ప్రత్యేక రైల్వే జోన్‌'గా ప్రకటించడం వల్ల ఆ ప్రాంత భూమిని కేవలం రైల్వే అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ పరిధిలో ప్రైవేట్ భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. రైల్వే విస్తరణ పనులు ప్రారంభించబడినప్పుడు భూసేకరణ ద్వారా యజమానులకు పరిహారం చెల్లించబడుతుంది. అయితే, ట్రాక్ చుట్టూ 20 మీటర్ల పరిధిలో ఇప్పటికే నివాసాలు, వాణిజ్య స్థలాలు ఉంటే, విస్తరణకు సంబంధించిన పనులు వాటిపై ప్రభావం చూపవచ్చు.